Bill Gates: ఏఐ దూసుకొచ్చినా.. ఆ మూడు ఉద్యోగాలు సేఫ్‌

కృత్రిమ మేధ(ఏఐ)(AI)) కారణంగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుండగా.. వాటి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రముఖ సంస్థల అధినేతలు చెప్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ (Bill Gates) స్పందించారు. ఏఐతో రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు నిరుపయోగంగా మారతాయని అన్నారు. మిగతా వాటితో పోల్చుకుంటే.. మూడు వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్‌ ముప్పు కాస్త తక్కువని అంచనావేశారు. కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్, బయాలజీ రంగాలు దీనిని తట్టుకొని నిలబడతాయని చెప్పారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపర్చుకునే లక్షణాన్ని ఏఐ ఇంకా సొంతం చేసుకోలేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు (Artificial Intelligence).


ఏఐతో కోడింగ్ ఉద్యోగాలు పోవచ్చనే ఆందోళన ఉంది. కోడ్‌ను రూపొందించడంలో, కొన్ని ప్రోగ్రామింగ్ టాస్క్‌లకు మనుషుల అవసరం లేకుండా ఏఐతో పనికానియొచ్చు. కానీ కచ్చితత్వం, లాజిక్, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాల్లో మాత్రం మనుషుల కంటే వెనకబడే ఉంది. క్లిష్టమైన సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు ఈ లక్షణాలన్నీ కావాలి మరి. డీబగ్గింగ్, ఏఐను మెరుగుపర్చడంలో ప్రోగ్రామర్స్ కీలకమని బిల్‌గేట్స్‌ (Bill Gates) అభిప్రాయపడుతున్నారు. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌ కోడ్ రాయడంలో ఉపయోగపడతాయి. అనుకోకుండా వచ్చే సవాళ్లను పరిష్కరించాలంటే ప్రోగ్రామర్స్ అవసరం ఉంటుందని చెప్పారు.

అలాగే ఎనర్జీ రంగ నిపుణులను ప్రస్తుతానికి ఏఐ ఢీకొట్టలేదని గేట్స్ (Bill Gates) అంటున్నారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, స్థిరమైన పరిష్కారాలను అమలు చేయడం, విద్యుత్‌ అంతరాయాలు, వనరుల కొరత వంటి సంక్షోభాలను పరిష్కరించడానికి మానవ నైపుణ్యం చాలా ముఖ్యమైనదని స్పష్టం చేస్తున్నారు. ఏఐలా కాకుండా.. ఆ రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలరని చెప్పారు. వారు నైతికతను, పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. అలాగే జీవశాస్త్రరంగం విషయానికొస్తే.. పెద్దమొత్తంలో ఉన్న డేటాను విశ్లేషించడానికి, వ్యాధి నిర్ధరణకు ఏఐ ఉపయోగపడుతుంది. కానీ వైద్య పరిశోధనలు, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన జీవశాస్త్రవేత్తలకు అత్యంత కీలకమని, ఆ లక్షణాలు కొత్త సాంకేతికతకు మనుషులకున్న స్థాయిలో లేదని ఒక షోలో మాట్లాడుతూ తెలిపారు.

ఇదిలాఉంటే.. గతంలో ప్రధాని మోదీ (PM Modi) ఏఐ ఆందోళన గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సాంకేతికత వల్ల మనం చేసే అన్ని పనుల్లో మార్పులు వస్తాయి. దానితో ఉద్యోగాలు పోతాయనే వదంతులు ప్రచారంలో ఉన్నాయి. చరిత్ర చూస్తే.. పని ఎప్పుడూ ఉంటుంది. అయితే పనిచేసే పద్ధతిలో మార్పులు వస్తుంటాయి. కొత్తరకం ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. వాటిని అందిపుచ్చుకోవడం కోసం స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌ అవసరం. ఉద్యోగాల్లో నైపుణ్యం పెంచుకునే వారికే ఉన్నతావకాశాలుంటాయి’’ అని వెల్లడించారు.