ఇక మన దేశంలో ప్రతి ఏడాది సంభవించే ప్రకృతి విపత్తుల వల్ల రోడ్లు మొత్తం సర్వనాశనం అవుతుంటాయి. కొన్ని గ్రామాలకు అయితే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. ఇక ప్రభుత్వం నష్టాన్ని అంచనా వేసి.. ఆ రోడ్డును నిర్మించేసరికి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. కాంట్రాక్టర్ కనుక దయతలిస్తే ఆ రోడ్డు కాస్త బాగుంటుంది. అధికారులు, కాంట్రాక్టర్ కుమ్మక్కయితే.. ఆ రోడ్డు నిర్మాణంలో నాణ్యత నేతి బీర సామెతను నిజం చేసి చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితి దేశ మొత్తం ఉన్నప్పటికీ.. కొత్త ఆవిష్కరణలు రావడం లేదు. నిర్మాణంలో సరికొత్త విధానాలు అవలంబించడం లేదు. తద్వారా రోడ్లలో నాణ్యత ఉండడం లేదు. పేరుకు జాతీయ రహదాలను నిర్మిస్తున్నామని చెప్తున్నప్పటికీ.. కనెక్టివిటీని పెంచుతున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ.. ఫీల్డ్ రియాలిటీ మాత్రం అలా ఉండడం లేదు. ఫలితంగా విలువైన ప్రజాధనం బూడిద పాలవుతోంది.
సరికొత్త టెక్నాలజీ
రోడ్డు నిర్మించినప్పుడు.. ఒకవేళ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. వాటంతటవే బాగు చేసుకుంటే ఎలా ఉంటుంది.. గుంతలను సరి చేసుకుంటే ఎలా అనిపిస్తుంది.. చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఇలాంటి సదుపాయం మా దేశంలో కూడా అందుబాటులో ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తోంది కదూ.. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది జర్మనీ. రోడ్ల నిర్మాణంలో సరికొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టి.. ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటుంది జర్మనీ.
జర్మనీలో ప్రకృతి విపత్తులు సంభవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. జర్మనీ యూరప్ లో ఉంటుంది కాబట్టి.. ఇక్కడ హిమపాతం విపరీతంగా కురుస్తూ ఉంటుంది. అందువల్ల రోడ్లు ధ్వంసం అవ్వడానికి.. గుంతలు పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు రోడ్ల నిర్మాణానికి.. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి జర్మనీ సరికొత్త పదవులకు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం రోడ్డు నిర్మాణంలో సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్ ను అక్కడి పరిశోధకులు డెవలప్ చేస్తున్నారు. కాంక్రీట్ మిశ్రమాలలో ప్రత్యేకమైన పదార్థాలను కలపడం వల్ల.. వర్షం పడినప్పుడు అది నీటితో కలిసి సున్నపురాయిలాగా మారుతుంది. అప్పుడు అది రోడ్డు మీద ఏర్పడిన పగుళ్లను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తుంది. రోడ్డుపై పగుళ్లు.. గుంతలు ఏర్పడినప్పుడు ఎవరి అవసరం లేకుండానే.. వాటంతట అవే మరమ్మత్తులు చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. విజయవంతమైన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది..” ప్రస్తుతం ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి. దేశంలోని అన్ని రోడ్లపై ఈ పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే నమూనాలు మొత్తం సేకరించారు. త్వరలో రోడ్ల నిర్మాణంలో ఈ పదార్థాలు వాడతారు. అవి కనక విజయవంతమైన ఫలితాలు అందిస్తే.. దేశంలో నిర్మించే రోడ్లలో మొత్తం ఈ పదార్థాలు వాడతారు. అప్పుడిక రోడ్లు నాణ్యంగా ఉంటాయి. పగుళ్లు అనేవి లేకుండా పటిష్టంగా ఉంటాయని” జర్మనీ మీడియా వ్యాఖ్యానిస్తోంది.
































