సైబర్ నేరాలో ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా చాలా మంది ఈ మోసాల బారిన పడుతున్నారు. రకరకాల మార్గాల్లో మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు.
ఫ్రాడ్ మెసేజ్‌లు, లింక్‌లతో డబ్బులను కొట్టేస్తున్నారు.
అయితే సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలన్నా, కోల్పోయిన డబ్బును మళ్లీ తిరిగి పొందాలన్నా కొన్ని రకాల మార్గాలు ఉన్నాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల వరకు, బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పిస్తున్నారు.
మీ అకౌంట్ నుంచి ఎలాంటి అనధికారిక లావాదేవీ జరిగినట్లు అనిపించినా వెంటనే ఒక పనిచేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెల్ప్‌లైన్ నంబర్‌ను నిర్వహిస్తోంది.
అదే 1930 నెంబర్. మీ అకౌంట్ నుంచి ఎలాంటి అనధికారిక ట్రాన్సాక్షన్ జరిగినా వెంటనే 1930 నెంబర్‌కు ఫోన్ చేయాలి. మీ ఫిర్యాదును చేసిన వెంటనే సదరు ట్రాన్సాక్షన్‌ను హోల్డ్‌లో పెడుతారు. దీంతో మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి.
అదే విధంగా మీ ఫిర్యాదును cybercrime.gov.inలో కూడా నమోదు చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్‌లో ఎలాంటి లోపాలు జరిగినా మోసపోయినట్లు అనుమానం వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అందుకే ప్రతీ ఒక్కరి ఫోన్‌లో ఈ నెంబర్‌ను కచ్చితంగా సేవ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.