అన్ని విషయాల్లోనూ ఈవీలే టాప్.. బ్యాటరీ విషయంలో తగ్గేదేలే

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. అయితే ఐసీఈ ఇంజిన్‌లతో నడిచే సంప్రదాయ వాహనాల జీవిత కాలంతో పోలిస్తే ఈవీల జీవిత కాలం చాలా తక్కువని అందరూ అనుకుంటారు. కానీ ఈవీ వాహనాలే జీవిత కాలం విషయంలో రారాజుగా నిలుస్తాయని ఇటీవల ఓ నివేదిక వెల్లడైంది.

వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొత్తవిగా ఉన్నాయి. అయితే ఈ వాహనాల సగటు జీవితకాలం గురించి కొనుగోలుదారులు ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఐసీఈ ఇంజిన్‌తో నడిచే కారుకు సంబంధించిన సగటు జీవితకాలాన్ని సులభంగా నిర్ధారించగలిగినప్పటికీ చాలా మందికి ఈవీల జీవితకాలాన్ని అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. అయితే ఒక అధ్యయనం ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలు వాస్తవానికి శిలాజ ఇంధనంతో నడిచే వాహనానికి సంబంధించిన జీవితకాలాన్ని అధిగమిస్తాయని పేర్కొంది. యూకేకు చెందిన వాహన టెలిమాటిక్స్ అందించే జియోటాబ్ అనే కంపెనీ చాలా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు కనీస వార్షిక క్షీణతతో 20 సంవత్సరాలు పని చేస్తాయని పేర్కొంది. ఈవీ బ్యాటరీ మొత్తం జీవితకాలం అనేక దేశాలలో సగటు కారు వయస్సు కంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.


భారతదేశంలో వాహన జీవిత కాలం 15 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే ఈవీ వాహనాల జీవిత కాలంలో దాని కంటే ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ క్షీణత దాదాపుగా సమస్య కాదని తేలింది. ఆధునిక ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ సగటున ప్రతి సంవత్సరం 1.8 శాతం క్షీణిస్తుందని, దీని ఫలితంగా చాలా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తాయని కూడా పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండవని నమ్మే మెజారిటీ ప్రజల భావనకు వ్యతిరేకంగా ఈ పరిశోధన ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ క్షీణత అనేది ఒక సరళ ప్రక్రియ కాదు. ఇది బహుళ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఉష్ణోగ్రత, స్థానం, డ్రైవింగ్ విధానం, ఛార్జింగ్ టెక్నాలజీ, ఛార్జింగ్ ఫ్రీక్వెన్సీ బ్యాటరీ జీవితకాలంపై ప్రభావం చూపుతాయి. బ్యాటరీ ప్యాక్‌కు అతి పెద్ద దెబ్బ దాని జీవితకాలానికి సంబంధించిన మొదటి కొన్ని సంవత్సరాల్లో వస్తుంది. ఆ తర్వాత అది తగ్గుతుంది. జీవితకాలానికి సంబంధించిన చివరి దశల్లో మరొక పెద్ద ప్రభావం చూపుతుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.