కొత్త మలుపు తీసుకుంటున్న ఐ బొమ్మ కేసు.. రవికి మద్దతు.. సజ్జనార్‍పై తీవ్ర విమర్శలు .. అసలేం జరుగుతోంది?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐ బొమ్మ (I BOMMA) రవి అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్‍గా మారింది. సినిమాలను పైరసీ చేసి వాటిని ఐబొమ్మ వెబ్ సైట్ లో పోస్టు చేయడంతో పాటు సినిమాల మాటున ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వైబ్‌సైట్లను ఇమ్మడి రవి (Immadi Ravi) ప్రమోట్ చేశారనే అభియోగాలపై ఆయన్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.


నిన్న మొన్నటి వరకు ఐ బొమ్మ రవి వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా సాగిన వ్యవహారం తాజాగా ఇండియన్స్ వర్సెస్ సిటీ సీపీ వి.సి సజ్జనార్‍గా (Sajjanar) మారుతోంది. ఐబొమ్మ రవి విషయంలో సజ్జనార్ తీరును తెలుగు ఆడియన్స్ పెద్ద ఎత్తున తప్పు పట్టడమే కాకుండా ఐ బొమ్మ రవికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బహిరంగంగానే ఐ బొమ్మ రవికి హ్యాట్సాప్ చెబుతూ సజ్జనార్ ను తీవ్ర స్థాయిలో తప్పు పట్టారు. అంతటితో ఆగకుండా సజ్జనార్‍ అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీంతో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ ఐ బొమ్మ రవిగా ఉండాల్సిన ఇష్యూ కాస్తా సోషల్ మీడియాలో ఆడియన్స్ పోస్టులతో ప్రేక్షకులు వర్సెస్ సజ్జనార్‍గా మారిపోయింది.

రవికి పెరుగుతున్న మద్దతు:

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీకి పాల్పడడం, బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం చట్టరీత్యా నేరం. అయితే ఈ విషయం సగటు ప్రేక్షకుడికి తెలిసినా రవికే మద్దతు ప్రకటించడం వెనుక కారణాలు సిటీ సీపీ సజ్జనార్, సినిమా పెద్దలు గ్రహించాలనే వాదన ప్రేక్షకుల వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. రవి చేసింది తప్పే కావొచ్చు కానీ ఆయన టాలీవుడ్ ప్రేక్షకులకు ఓ రాబిన్ హుడ్ లాంటి వాడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులకు అందన్నంత ఎత్తుకు టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులపై ఆ భారం మోపడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇక సినిమా మధ్యలో థియేటర్లలో కొనే స్నాక్స్ రేట్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు స్పందించకపోగా, స్పందిచిన కొద్ది మందైనా ప్రేక్షకులపై వెటకారపు మాటలే మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో జరుగుతున్న పరిణామాల మధ్య ఐబొమ్మ రవికి మద్దతు పెరుగుతోంది. ఓ ఆటో డ్రైవర్ ఏకంగా ఆటో వెనుక ఐబొమ్మ రవికి మద్దతుగా స్టిక్కర్ అంటించి తిప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సజ్జనార్‍పై తీవ్రమవుతున్న ఆరోపణలు:

తెలంగాణ పోలీస్ శాఖలో ఐపీఎస్ సజ్జనార్‍కు ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరుంది. గతంలో వరంగల్, ఇటీవల దిశ ఎన్ కౌంటర్‍తో ఆయన పేరు మరింత పాపులర్ అయింది. ఈ క్రమంలో ఐ బొమ్మ రవిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడం ఈ అరెస్టు విషయంలో సినిమా పెద్దలతో కలిసి సజ్జనార్ నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సమావేశంలో సజ్జనార్ పోలీస్ ప్రోటోకాల్ పాటించలేదని పోలీసుల అధికారిక మీడియా సమావేశంలో సినిమా రంగ పెద్దలను కూర్చోబెట్టుకోవడానికి వీలు లేదని మరి సజ్జనార్ మాత్రం చిరంజీవి,దిల్ రాజు, నాగార్జున వంటి ఇండస్ట్రీ పెద్దలను ఎలా కూర్చోబెట్టుకున్నారని బక్క జడ్సన్ ఆరోపించారు. కనీసం హోం గార్డులు కూడా కానీ సినీ పెద్దలను పోలీసు అఫీషియల్ ప్రెస్ మీట్‍లో తన పక్కన సజ్జనార్ ఎలా కూర్చోబెట్టుకుంటారని నిలదీశారు. ఈ విషయంలో తాను హోంశాఖకు కూడా ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇక సజ్జనార్ విషయంలో తీన్మార్ మల్లన్న ఘాటు విమర్శలే చేశారు. పోలీసులకు సవాల్ విసిరిన ఐ బొమ్మ రవిని అరెస్టు చేశామని ఇది పోలీసుల దెబ్బ అంటూ సజ్జనార్ చెబుతున్నారు. కానీ ఐబొమ్మ రవిని ఆయన భార్య పట్టించకుంటే మీ పోలీసు కుక్కలు కూడా రవి వాసన పసిగట్టేవి కాదని, రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యం విపరీతంగా ఉందని మీకు దమ్ముంటే వారిని పట్టుకుని చూపించాలని మల్లన్న సవాల్ విసిరారు. మీరు నిజంగా మొనగాడివే అయితే సైబర్ క్రైమ్ వింగ్ లో ట్రేస్ ఔట్ కానీ కేసులు చాలా ఉన్నాయని వాటిని పట్టుకోవాలన్నారు. సినిమా వాళ్లను పక్కన పెట్టుకుని సినిమా డైలాగులు ఎందుకు? మీవన్నీ ఫేక్ ఎన్ కౌంటర్లు, మీ అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందని ఘాటు విమర్శలు చేశారు. ఇక నెటిజన్లు స్పందిస్తూ సజ్జనార్ వ్యవహార శైలిలో పొలిటికల్ అంబిషియన్ కనిపిస్తోందని ఆరోపించారు. ఐ బొమ్మ అరెస్టు విషయంలో సినిమా రంగం వర్సెస్ రవి మధ్య ఉన్న ఇష్యూ నెటిజన్ల పోస్టులతో ఇండియన్స్ వర్సెస్ పోలీస్ ఆఫీసర్ గా మారింది.

సీపీ సమాధానం ఏంటో?:

ఐ బొమ్మ రవి అరెస్ట్ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మాత్రమే కాకుండా తన కెరీర్ పై కూడా నెటిజన్లు ఆరోపణలు చేస్తుంటడం పట్ల సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉంటూనే ఐ బొమ్మ రవిని హీరో అంటూ ప్రశంసించారు. అనేక మంది నెటిజన్లు సజ్జనార్ తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఓ వైపు రవికి మద్దతు పెరుగుతూ తనపై విమర్శలు వస్తున్నా సజ్జనార్ మాత్రం ఇప్పటి వరకు వీటిపై స్పందించలేదు. దీంతో ఈ ఆరోపణల విషయంలో సీపీ వ్యూహం ఏమిటి? తన విమర్శకులకు ఎలా కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.