ఈసారి జాతరకు 3,495 ప్రత్యేక బస్సులుసాక్షి, హైదరాబాద్: మేడారం జాతరకు ఈసారి ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో చార్జీలు 50 శాతం అదనంగా వసూలు చేయాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నందున, గతంతో పోలిస్తే బస్సుల సంఖ్య పెంచాలని భావించినా వాటి లభ్య త సమస్యగా మారింది. దీంతో అందుబాటులో ఉన్న బస్సులను తిప్పాలని నిర్ణయించింది. ప్రత్యేక పండుగలు, జాతరలు, ఇతర ఉత్సవాల సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీకి అనుమతి ఉంది. దాన్ని వినియోగించుకోవటం ద్వారా సాధారణ చార్జీలను అంతమేర పెంచాలని నిర్ణయించింది.
‘ప్రత్యేకం’లోనూ మహిళలకు ఉచితమే..
జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది. గత జాతర సమయంలో 3,491 ప్రత్యేక బస్సులను నడిపితే అవి కీలక సమయాల్లో సరిపోలేదు. కొంత నిర్వహణ లోపాల వల్ల ఆర్టీసీ బస్సులను భక్తులు వాడుకోలేకపోయారు. వెరసి ఇబ్బందులు ఎదురయ్యాయని సంస్థ గుర్తించింది. దీంతో ఈసారి అంతకంటే ఎక్కువ బస్సులు నడపాలని నిర్ణయించింది. కానీ, బస్సుల సర్దుబాటు కష్టంగా మారటంతో ప్రస్తుతానికి 3,495 బస్సులను సిద్ధం చేసుకుంది. అవసరమైతే మరికొన్నింటిని సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది.
ఈ బస్సులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడుస్తాయి. వీటిల్లో సాధారణ చార్జీకి 50 శాతం అదనపు మొత్తాన్ని జోడించి వసూలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ (ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్) వసతి ఉన్నందున మహిళా ప్రయాణికులకు ఈ నిర్ణయం భారం కాబోదు. కానీ, పురుష ప్రయాణికుల జేబులపై మాత్రం భారం పడనుంది.
వీఐపీ పాస్‌లను నియంత్రించాల్సిందే…
గత జాతర సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బడి ముబ్బడిగా వీఐపీ పాస్‌లు జారీ చేశారు. ఒకే సమయంలో ఎక్కువ మంది వీఐపీలు రావటం, వారి వాహన శ్రేణి జాతర వరకు అనుమతించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. ఆయా సమయాల్లో పోలీసులు ఆర్టీసీ బస్సులను లోనికి అనుమతించలేదు. దీంతో బస్సులు శివారు ప్రాంతాల్లోనే నిలిచిపోయి సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా, పాసుల జారీని నియంత్రించాలని ఆర్టీసీ అధికారులు ములుగు జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. వచ్చే వీఐపీలు కూడా ఒకే సమయంలో రాకుండా నియంత్రించాలని కూడా కోరారు. ఆర్టీసీ బస్సులను నిలిపివేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.

































