Andhra news: రూ.10కే ఆకలి తీరుస్తున్న రైతు

పది రూపాయలకు సరైన టీ దొరకడమే కష్టం.. అదే పదికి వెజ్‌ బిర్యానీ వడ్డిస్తున్నారు ఆ రైతు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆసుపత్రికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు నిత్యం వస్తుంటారు. వారొచ్చిన వేళ అధికారులు అందుబాటులో లేకపోతే తిరిగెళ్లి రాలేక కాలే కడుపులతో కొందరు అక్కడే అలమటిస్తున్నారు. దీన్ని గుర్తించిన స్థానిక రైతు వీరమాచనేని శివాజీ సామాజిక స్పృహతో తక్కువ మొత్తానికే వారి ఆకలి తీర్చాలనుకున్నారు. అందుకు తన వ్యవసాయ క్షేత్రంలో పండే సేంద్రియ బియ్యంతో బిర్యానీ తయారు చేస్తున్నారు. రూ.10కే వెజ్‌ బిర్యానీ వడ్డిస్తున్నారు. 2016 నుంచి 2019 వరకు సుమారు నాలుగేళ్ల పాటు రూ.5కే వెజ్‌ బిర్యానీ అందించారు. గడిచిన ఐదేళ్లు అనివార్య పరిస్థితుల్లో ఆపేయగా.. వారం క్రితం తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం రూ.10కి 200 గ్రాముల వెజ్‌ బిర్యానీ ఇస్తున్నారు. అలాగే రూ.10కి పెరుగన్నం పెడుతున్నారు. రోజుకు సగటున 75 నుంచి 100 మంది తింటున్నారు. ‘రోజూ తెల్లవారుజామున 4 గంటలకు లేచి, నేనే కూరగాయలు తరుగుతా. 10 గంటలకు వంట ప్రారంభించి 12 గంటల కల్లా సిద్ధం చేస్తా. సహాయకురాలిగా ఒకరిని పెట్టుకున్నా. నాకు లాభం అవసరం లేదు. ఒక రైతుగా.. ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా ఇది చేస్తున్నా’ అని శివాజీ పేర్కొన్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.