దేశంలో టోల్ చెల్లింపుల కోసం భారత ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద రద్దీ, జాప్యాన్ని తగ్గించటంతో పాటు ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ విధానాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో నేషనల్ పెమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్ బ్యాలెన్స్ వ్యాలిడేషన్ కోసం కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని కింద మార్పు చేయబడిన రూల్స్ ఫిబ్రవరి 17, 2025 నుంచి అమలులోకి రానున్నాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన రూల్స్ తెలుసుకోకపోతే పెనాల్టీలు, పేమెంట్ రిజెక్షన్స్ వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
కొత్త రూల్స్ ప్రకారం మీ ఫాస్టాగ్ ఖాతా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నట్లయితే లేదా తక్కువ బ్యాలెన్స్, పెండింగ్ KYC అప్‌డేట్స్ లేదా టోల్ ప్లాజాకు చేరుకోవడానికి 60 నిమిషాల ముందు ఫాస్టాగ్ వివరాలు వాహన వివరాలు సరిపోలకపోతే ఫాస్టాగ్ లావాదేవీలు తిరస్కరణకు గురవుతాయని వెల్లడించబడింది. ఈ క్రమంలో టోల్ రీడర్ వాహన ఫాస్టాగ్ స్కాన్ చేసిన తర్వాత 10 నిమిషాలు బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నట్లయితే ట్రాన్సాక్షన్ తిరస్కరించబడుతుందని ఎన్పీసీఐ వెల్లడించింది. అంటే టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ రీడ్ చేయటానికి 60 నిమిషాల ముందు 10 నిమిషాల తర్వాత సమయంలోనే ఏదైనా సమస్య ఉన్నట్లయితే దానిని వెంటనే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకు మీరు ప్రయాణం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 11.30 గంటల సమయానికి టోల్ ప్లాజా వద్దకు చేరుకుంటే 70 నిమిషాల వ్యవధిలో మీరు ఫాస్టాగ్ విషయంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే పరిష్కరించకపోతే టోల్ ప్లాజా వద్ద లావాదేవీ తిరస్కరించబడుతుంది. టోల్ రీడింగ్ తర్వాత 10 నిమిషాల్లోపు మీ ఖాతాను రీఛార్జ్ చేస్తే లేదా మీ KYCని అప్‌డేట్ చేస్తే, సిస్టమ్ చెల్లింపును ప్రాసెస్ చేస్తుంది. సమస్యను సకాలంలో పరిష్కరించుకుంటే సాధారణ రుసుము వసూలు చేయబడుతుంది. లేనిపక్షంలో డబుల్ రుసుము వసూలు చేయబడుతుంది.
మరి పెనాల్టీలను తప్పించుకోవటం ఎలా..?
టోల్ చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టడంతో పాటు ప్రయాణాన్ని సరళీకృతం చేయటానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ సకాలంలో సమస్యలను పరిష్కరించుకోకపోతే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ప్రస్తుతం పెరగనున్నాయి. ఇబ్బంది లేని టోల్ లావాదేవీలను నిర్ధారించడానికి, జరిమానాలను పొందకుండా ఉండటానికి.. టోల్ ప్లాజాలను చేరుకోవడానికి ముందే ఫాస్టాగ్ యూజర్లు తమ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్‌ను నిర్వహించాలి. బ్లాక్‌లిస్టింగ్‌ను నివారించడానికి కేవైసీ క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయటం పూర్తి చేయాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలకు వెళ్లే ప్రజలు సమస్యలను ముందుగానే పరిష్కరించుకోవటం సమస్యలను నివారిస్తుందని గుర్తుంచుకోవాలి.