నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. కాలిబూడిదైన ఇన్నోవాలో 8 మంది

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.


గుండ్రాంపల్లి సమీపంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (NH-65) పై వేగంగా దూసుకెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం పల్టీలు కొట్టి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది. ఈ ఘటనలో క్షణాల్లోనే ఇన్నోవా ఇంజిన్‌లో మంటలు చెలరేగి, మొత్తం కారు అగ్నికి ఆహుతైంది.

అయితే ప్రమాదం సంభవించిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగి క్షణాల్లోనే మంటలు చెలరేగినా, వారు సమయస్ఫూర్తిగా స్పందించి వాహనం నుండి బయటపడ్డారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయి, ఐరన్ ఫ్రేమ్ మాత్రమే మిగిలింది. ఇక ఇన్నోవా రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం గంటల పాటు వాహనాలు కిలోమీటర్ల మేర కదలక నిలిచిపోయాయి. చిట్యాల వరకు వాహనాల క్యూలు ఏర్పడ్డాయి. పోలీసులు, హైవే ప్యాట్రోలింగ్ బృందం సహాయంతో ప్రమాదగ్రస్త వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు.

అధిక వేగం కారణంగానే ఇన్నోవా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ అలసట లేదా నిద్రమత్తు కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. హైవేపై రాత్రి వేళల్లో ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక నిఘా అవసరమని ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే ఇదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.

మరోవైపు ఇటీవలే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి, అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.