రైతులకు తోడ్పాటు అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలతో కలిసి పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పలు సంస్థలకు ప్రభుత్వ ఆలోచనలను వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని ఆ సంస్థలను ఆహ్వానించారు. అక్కడ సీఎంతో సమావేశమైన అమెరికా సంస్థ పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బుధవారం ఏపీకి వచ్చారు. ఆ సంస్థ చైర్మన్ క్రెగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెక్‌కర్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సీఈవో కీత్ అగోడా అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దావోస్ సమావేశానికి కొనసాగింపుగా జరిగిన ఈ భేటీలో రానున్న రోజుల్లో కలిసి పని చేసే అంశాలపై చర్చించారు. ప్రకృతి సేద్యంలో భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుంచి వినియోగదారుడి వరకు ఎండ్ టూ ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెట్ డెవల్‌పమెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఈ సంస్థలు సహాయపడనున్నాయి. పబ్లిక్, ప్రైవేట్ సంస్థల నుంచి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సహకారాన్నిస్తాయి. ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఏపీని గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రైతుసాధికార సంస్థతో పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్ ట్రస్ట్ సంస్థలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాష్ట్రంలో అవకాశాలను, ప్రభుత్వ లక్ష్యాలను, ప్రస్తుత పరిస్థితులను ఆ సంస్థల ప్రతినిధులకు వివరించారు.
ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందని, రానున్న రోజుల్లో ఆహార ఉత్పత్తుల సర్టిఫికేషన్, ట్రేసబులిటీ అనేవి కీలకం కానున్నాయని సీఎం చెప్పారు. ఈ దిశగా రైతులను, ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యం తన కల అని సీఎం చెప్పారు. దీనికి సహకరించాల్సిందిగా ఆసంస్థల ప్రతినిధులను కోరారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 12.5 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. 2028-29 నాటికి 40 లక్షల మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి, తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు జరిగేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.