first Sai baba temple at Bhivpuri.-ప్రపంచంలోనే తొలి బాబా గుడి – భివ్‌పురి. ఆ కథేంటో తెలుసుకుందామా..?

www.mannamweb.com


ముంబై, పూనెలకు మధ్య ఉన్న రైలు మార్గంలో కనిపించే ఒక చిన్న గ్రామం భివ్‌పురి. 1916లో ఇక్కడ నిర్మించిన సాయిబాబా ఆలయమే ప్రపంచంలోని మొట్టమొదటి బాబా గుడి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని సాక్షాత్తూ బాబాగారే అందించడం ఒక విశేషం అయితే, ఈ ఆలయాన్ని నిర్మించిన కేశవ్‌ రామచంద్ర ప్రధాన్‌ ఒక నాస్తికుడు కావడం మరో విశేషం.
రామచంద్ర ప్రధాన్‌
భివ్‌పురి గ్రామానికి చెందిన రామచంద్ర ప్రధాన్‌ ఒక సాధారణ గుమాస్తా. ముంబైలో నివసించే ఒక పార్శీ వర్తకుని వద్ద అతను పనిచేసేవాడు. తన యజమాని ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడమే రామచంద్ర పని. అలా పని మీద రామచంద్ర మన్మాడ్‌, నాసిక్‌ వంటి ప్రాంతాల్లో తిరుగుతూ ఉండేవాడు. రామచంద్రకి ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితునికి బాబా మీద మహా గురి. రామచంద్ర షిరిడీకి దగ్గరగా వెళ్లినప్పుడల్లా, తనతో కలిసి షిరిడీకీ రమ్మని ప్రాధేయపడేవాడు స్నేహితుడు. కానీ చిన్నప్పటి నుంచి దేవుళ్లన్నా, మహత్యాలన్నా నమ్మకం లేని ప్రధాన్‌, స్నేహితుడి మాటలను లెక్కచేసేవాడు కాదు. అయితే చివరికి ఒకసారి షిరిడీకి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు ప్రధాన్‌. కాకపోతే తాను సత్రంలోనే ఉండిపోతాననీ, బాబా ఉన్న మసీదులోకి అడుగుపెట్టననీ షరతు పెట్టాడు.
రామచంద్రని సత్రంలోనే ఉంచి తాను మాత్రం హారతి వేళ బాబాను దర్శించుకునేందుకు వెళ్లిపోయాడు స్నేహితుడు. హారతి మొదలైంది. మధురమైన హారతి పాట, లయబద్ధమైన సంగీతమూ మసీదు నుంచి వినిపిస్తోంది. ఆ శబ్దాలకు ప్రధాన్‌ కాలు నిలువలేదు. తనకు తెలియకుండానే నడుచుకుంటూ మసీదులోకి అడుగుపెట్టాడు ప్రధాన్‌. అడుగుపెట్టడమే కాదు! అక్కడ ఉన్న బాబాని చూసి మైమరచిపోయాడు. ఆ మరపులోనే ఆయన వద్దకు వెళ్లి నిల్చొన్నాడు. ప్రధాన్‌ని చూసిన బాబా తన అలవాటు ప్రకారం దక్షిణను అడిగారు. అప్పటికీ ప్రధాన్‌ మైకంలోనే ఉన్నాడు. తన యజమాని కోసం వసూలు చేసిన 2,500 రూపాయలను తీసి మారు మాట్లాడకుండా బాబా చేతిలో ఉంచాడు.
మహిమ తెలిసింది
ప్రధాన్‌ తిరిగి తన సత్రానికి వచ్చిన తరువాత కానీ, జరిగినదేమిటో మనసుకి తోచలేదు. కానీ ఇప్పుడేం చేసేంది? తన యజమానికి ఏమని చెప్పేది? అసలు యజమాని దగ్గరకు తిరుగు ప్రయాణం చేయడానికి కూడా అతని వద్ద తగినంత ధనం లేదయ్యే! ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ప్రధాన్ తన ఊరు భివ్‌పురికి చేరుకున్నాడు. తనకి ఒంట్లో బాగోలేదనీ, ఆరోగ్యం కుదుటపడగానే వచ్చి కలుస్తాననీ యజమానికి కబురు పంపాడు. కానీ యజమాని నుంచి ఒక చిత్రమైన జవాబు తిరిగి వచ్చింది. ‘కావల్సినంత విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరువాతే రమ్మనీ…. ఎందుకంటే ఏ రుణాన్ని వసూలు చేసేందుకు ప్రధాన్‌ తిరుగుతున్నాడో, దానికి రెట్టింపు వసూలు అయ్యిందనీ’ ఆ సందేశంలోని సారాంశం. ఆ జవాబు విన్న ప్రధాన్‌కి మతి పోయినంత పనయ్యింది. ఇదంతా కూడా బాబా మహిమేనని తెలిసొచ్చింది.
బాబా హెచ్చరిక
ఈ సంఘటన జరిగిన దగ్గర్నుంచీ ప్రధాన్‌ తరచూ షిరిడీ వెళ్లేవాడు. అంతేకాదు! తనతో ఓసారి తన ఊరు భివ్‌పురికి రమ్మని బాబాను తెగ పోరేవాడు. అలా పోరగా పోరగా చివరికి ఓసారి బాబాగారు విసిగిపోయి, తన విగ్రహాన్ని ప్రధాన్‌ చేతిలో ఉంచి- ‘భివ్‌పురికి వెళ్లి ఒక ఆలయాన్ని నిర్మించు. అందులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ట చేయి. ఇక నువ్వు షిరిడీకి రానవసరం లేదు,’ అని తేల్చిచెప్పారు.
తొలి ఆలయం
బాబా అనుజ్ఞను అనుగుణంగా ప్రధాన్, 1916లో ఒక ఆలయాన్ని నిర్మించి బాబా స్వహస్తాలతో అందించిన విగ్రహాన్ని ప్రతిష్టించాడు. బాబా వాగ్దానం చేసినట్లుగానే ఆయన ఉనికి తరచూ అక్కడ భక్తులకు అనుభవమయ్యేది. ఆలయానికి ఎదురుగా ఉన్న చెట్టు నీడన బాబా విశ్రమించడం కనిపించేది. తెల్లవారుజామున మూడుగంటలకు ఆలయం తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపించేది. భివ్‌పురి చాలా చిన్న గ్రామమే అయినప్పటికీ, అక్కడి బాబా ఆలయానికి ఉన్న విశిష్టత గురించి తెలుసుకున్న భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. పచ్చటి పొలాల మధ్య, ప్రశాంతమైన వాతావరణం మధ్య ఉన్న భివ్‌పురి గుడి ఇప్పటికీ బాబా ఉనికిని చాటుతూనే ఉంది.