నిర్లక్ష్య వైద్యంతో రోగి మరణానికి కారణమైతే సదరు డాక్టర్‌కు ఇక నుంచి ఐదేళ్లు జైలు శిక్షను విధించనున్నారు. ప్రస్తుతం ఉన్న రెండేళ్ల కాలాన్ని పెంచుతూ కొత్త చట్టాలను రూపొందించారు.
ఈ మేరకు వైద్యులకు అవగాహన కల్పించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్‌హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గోయల్ అన్ని రాష్ట్రాల సీఎస్, హెల్త్ సెక్రటరీలకు లేఖ రాశారు. ప్రస్తుతం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్య సిబ్బందికి ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉన్నది.
కానీ దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం కచ్చితంగా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంతేగాక గరిష్ఠంగా ఐదేండ్ల శిక్ష పడేలా చట్ట సవరణ జరిగిందని గుర్తు చేసింది. డాక్టర్ అయితే ఐదేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారని, ఆర్‌ఎంపీ అయితే (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్) రెండేండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉన్నదని కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం దేశంలో ‘ఇండియన్ పీనల్ కోడ్ 1860’ అమల్లో ఉండగా, దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సక్ష్య అభియాన్ పేరుతో మూడు కొత్త చట్టాలు అమల్లోకి రానున్నాయి.