ఐదేళ్ల శ్రమ.. ఇంగువ పండిందోచ్‌! అవును నిజమే

ఇంగువ.. (Heeng or asafoetida) మన ఆహార సంస్కృతితో విడదీయరాని అనుబంధం ఉన్న సుగంధ్ర ద్రవ్యం. భారతీయ వంటకాల్లో ఇంగువకు విశిష్ట స్థానం ఉంది. ఏ వంటకంలో అయినా చిటికెడు వేస్తే చాలు.


అతి తక్కువ పరిమాణంలో వినియోగించినా అత్యంత ప్రభావశీలతనుచూపే విశిష్ట ద్రవ్యం. ఇది కూడా ఒక మొక్క నుంచే వస్తుంది. వేలకొలదీ పంటల జీవ వైవిధ్యానికి ఆలవాలమైనభారతదేశంలో ఇంగువ పంట మాత్రం లేదంటేఆశ్చర్యం కలుగుతుంది. ఇది నిజం. ప్రతి ఏటా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. 2022-23లో 1,442 టన్నుల (విలువ రూ. 1,504 కోట్లు) ఇంగువను దిగుమతి చేసుకుంటున్నాం.

అయితే, సరికొత్త కబురేమిటంటే.. శీతల ఎడారుల్లో పండే ఈ పంటనుఇప్పుడు మన దేశంలోనూ పండించటం ప్రారంభించాం. భారతీయఇంగువ పంట సాగు చరిత్రలో 2025 మే 28 ఒక మైలురాయి. విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి, మన దేశపు వాతావరణానికిమచ్చిక చేసుకొని, సాగు చేయటంలో విజయం సాధించినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ సిఎస్‌ఐఆర్‌ అధికారికంగా ప్రకటించిన రోజిది. అన్నట్లు.. వంటకాల్లోనే కాదు, ఔషధంగానూ.. పంటలనుఆశించే తెగుళ్ల నివారణకూ ఇంగువ మందే! భారతీయ ఇంగువ పంటకుశుభారంభం జరిగిన సందర్భంగా ఆవిశేషాలేమిటో తెలుసుకుందాం.. మనం వాడుతున్న ఇంగువ శాస్త్రీయ నామం ‘ఫెరుల అస్స-ఫోటిడ’ ((Ferula assa-foetida). ఇంగువ సాధారణ వాతావరణంలో పండదు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పండుతుంది.

ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్‌ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లో సాగు చేయటం ప్రారంభం. బయోరిసోర్స్‌ సెంటర్‌ (ఐహెచ్‌బిటి)లోని శాస్త్రవేత్తలు ఐదేళ్లుశ్రమించి ఇంగువ పంటను ఎట్టకేలకు మచ్చిక చేసుకున్నారు. ఈ విషయాన్ని మే 28న ప్రకటించారు. ఐహెచ్‌బిటి పాలంపూర్‌ క్యాంపస్‌లో ఇంగువ విత్తనోత్పత్తి కేంద్రాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి డా. జితేంద్ర సింగ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రారంభించారు. మొదటి విడత ఇంగువ మొక్కల నుంచి విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో, ఇక మన దేశంలో ఈ పంట పండించగలం అని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఫలించిన ఐదేళ్ల శ్రమ
ఐహెచ్‌బిటి శాస్త్రవేత్తలు 2018లో తొలుత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్‌ దేశాల నుంచి ఇంగువ మొక్క విత్తనాలను అధికారికంగా జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్‌-ఎన్‌బిపిజిఆర్‌) ద్వారా క్వారంటైన్‌ వ్యవస్థ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఆ విత్తనాలను ప్రత్యేక నియంత్రిత వాతావరణంలో సాగు చేసి, వాటి ద్వారా ప్రమాదకరమైన చీడపీడలేవీ దిగుమతి కావటం లేదని నిర్థారణ అయిన తర్వాతే విత్తనాలను మన వాతావరణంలోకి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత టిష్యూకల్చర్‌ పద్ధతిలో ఇంగువ మొక్కలను అభివృద్ధి చేశారు. ఈ ప్రక్రియ మొత్తానికీ ఐదేళ్ల సమయం పట్టింది.

మహాభారత కాలంలోనే…
ఇంగువ ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాలతోపాటు, మహాభారతం వంటి పురాతన గ్రంథాల్లోనే ఉంది. ఇంద్రియాలను, మానవ చేతనను శుద్ధి చేయటానికి ఇంగువను వాడేవారు. కడుపు నొప్పి, అజీర్తి నివారణకు.. వంటకం రుచిని పెంపొందించటం కోసం ఇంగువను ఉపయోగపడుతుందని చరక సంహిత చెబుతోంది. పిప్పాలడ సంహిత,పాణిని రచనల్లోనూ ఇంగువ ఉనికి ఉంది.

-4 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు
అతి తక్కువ వర్షపాతం పడే అతి శీతలప్రాంతాల్లో ఇంగువ మొక్క పెరుగుతుంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతాల్లో అనాదిగా సాగవుతోంది. నీరు నిలవని, తేమ తక్కువగా ఉండే ఇసుక నేలల్లో పెరుగుతుంది. ఏడాదికి 200 ఎం.ఎం. కన్నా తక్కువ వర్షపాతం ఉండాలి. 10-20 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత నప్పుతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటుంది. శీతాకాలంలో -4 డిగ్రీల చలిని కూడా తట్టుకుంటుంది. అతిశీతల, అతి వేడి వాతావరణ పరిస్థితుల్లో ఇంగువ మొక్క నిద్రావస్థకు వెళ్లిపోతుంది. వాతావరణం అనుకూలించాక మళ్లీ చిగురిస్తుంది. అందుకే హిమాచల్‌ప్రదేశ్‌లోని లహాల్‌-స్పిటి జిల్లాల్లో ఈ పంట సాగుపై శాస్త్రవేత్తలు ఐదేళ్లుగా చేసిన ప్రయోగాలు ఫలించాయి.

ఇంగువ మొక్కకు తల్లి వేరు నేలలోపలికి వేరూనుకుంటుంది. మందపాటి ఆ వేరు నుంచి, దుంప నుంచి సేకరించిన జిగురు వంటి పదార్ధాన్ని సేకరిస్తారు. దాన్ని ఎండబెట్టి, ప్రాసెస్‌ చేస్తే.. జిగురు పరిమాణంలో 40-64% మేరకు ఇంగువ వస్తుంది. ఔషధంగా వాడే ఇంగువ వేరు. వంటకు వాడే ఇంగువ వేరు. ఔషధంగా వాడే ఇంగువనే పంటలపై తెగుళ్ల నివారణకూ వాడుతుంటారు. ఇంగువ మొక్క పెరిగి పూత దశకు ఎదగడానికి ఐదేళ్ల సమయం పడుతుంది.

2018లో విదేశాల నుంచి తెచ్చిన విత్తనాలను క్వారంటైన్‌ లాంఛనాలన్నీ పూర్తి అయ్యాక 2020 అక్టోబర్‌ 15న మన దేశ వాతావరణంలో నాటారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహాల్‌ లోయలోని క్వారింగ్‌ గ్రామంలో మొదట నాటడం ద్వారా భారతీయ ఇంగువ పంట సాగు ప్రారంభం అయ్యింది. ఐహెచ్‌బిటి పాలంపూర్‌లో ఏర్పాటైన జెర్మ్‌ప్లాజమ్‌ రీసోర్స్‌ సెంటర్‌లో ఇంగువ విత్తనోత్పత్తి, శిక్షణ, ఇంగువ ఉత్పత్తి తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడే టిష్యూ కల్చర్‌ యూనిట్‌ కూడా ఏర్పాటు కావటంతో విస్తృతంగా ఇంగువ మొక్కల ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ పంట సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించడానికి జిపిఎస్‌ డేటా ఆధారంగా పెద్ద కసరత్తే జరిగింది. ఎకలాజికల్‌ నిచే మోడలింగ్‌ పద్ధతిలో అనువైన స్థలాలను గుర్తించటం, సాగు చేయటంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. వారి ఐదేళ్ల కృషికి గుర్తింపుగా గత నెల 28న అధికారికంగా ఇంగువ పంటను మన నేలలకు అలవాటు చేసి, విత్తనోత్పత్తి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. అతిశీతల ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఇంగువ మొక్కల్ని సముద్రతలానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉండే పాలంపూర్‌ వంటిప్రాంతాల్లో సాగు చేయటంలో విజయం సాధించటమే మనం సాధించిన ఘన విజయంగా శాస్త్రవేత్తలు సంబరంగా చెబుతున్నారు.

సుసంపన్నమైన వ్యవసాయక జీవవైవిధ్యానికి ఒకానొక కేంద్ర బిందువైన భారతావని సిగలో మరో కొత్త పంట సరికొత్త ఘుమఘుమలతో చేరటం మనందరికీ సంతోషదాయకం. ఆ విధంగా హిమాచల్‌ రైతులు పండించే ఇంగువను మున్ముందు మనం రుచి చూడబోతున్నామన్నమాట!

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.