మీ UAN నంబర్‌ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి

ఈపీఎఫ్‌ (EPF) ఖాతాదారులకు యూఏఎన్ నంబర్‌ చాలా కీలకం. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) తమ సభ్యులకు కేటాయించే 12 అంకెల సంఖ్య.


దీని ద్వారా సభ్యులు ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ ఖాతాకు సులభంగా లాగిన్‌ అవ్వొచ్చు. పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, కేవైసీ, బ్యాంకు ఖాతా వివరాలను అప్‌డేట్‌, ఖాతాల విలీనం వంటివి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌ చేయాలన్నా ఈ యూఏఎన్‌ తప్పనిసరి.

అలాంటి ఈ సంఖ్య మీ వద్ద లేకపోతే కొన్ని సింపుల్‌ టిప్స్‌ ద్వారా తిరిగి పొందొచ్చు.

  • ఈపీఎఫ్‌ఓ అధికారిక వెబ్‌సైట్‌ epfindia.gov.in పోర్టల్‌కు వెళ్లండి. ఆ పేజీలో ప్రావిడెంట్‌ ఫండ్‌, పెన్షన్‌, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన వివిధ సేవలు అందుబాటులో ఉంటాయి.
  • హోమ్‌ పేజీలో ‘సర్వీసెస్‌’ సెక్షన్‌కు వెళ్లాలి. దాంట్లో ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్‌ చేయాలి.

    అక్కడ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తనిఖీలు, యూఏఎన్‌కు సంబంధించిన అనేక రకాలు సేవలు ఉంటాయి.

  • ‘ఫర్‌ ఎంప్లాయీస్‌’ సెక్షన్‌ కింద ఉన్న ‘మెంబర్‌ యూఏఎన్/ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌’ పై క్లిక్‌ చేయండి. అక్కడ యూఏఎన్‌ను తిరిగి పొందడం, కేవైసీ అప్‌డేట్‌, పాస్‌బుక్‌ యాక్సెస్‌ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి.
  • ‘మెంబర్‌ యూఏఎన్/ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌’ క్లిక్‌ చేసి ఈపీఎఫ్‌ఓ రికార్డుల ప్రకారం మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాన్‌, ఆధార్‌ వంటి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి. మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి, క్యాప్చా టైప్‌ చేశాక ‘రిక్వెస్ట్‌ ఓటీపీ’ పై క్లిక్‌ చేయండి.
  • ఇప్పుడు మొబైల్‌ నంబర్‌కు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. దాన్ని ధ్రువీకరించడానికి మీకొచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి. తర్వాత ‘షో మై యూఏఎన్‌’ పై క్లిక్‌ చేయండి. మీ యూనివర్సల్ అకౌంట్‌ నంబర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.