గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమన్నారు.
అలానే గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చారని గుర్తు చేశారు. అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే.. తమ బండారం బయటపడిందని , తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు.
వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబం పైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? అని ఫైర్ అయ్యారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? అని మండిపడ్డారు జగన్. సుప్రీం ఆదేశాలతో దిగువ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. అలాంటప్పుడు పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటికి వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరికి జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తుండడం అధికార దుర్వినియోగం కాదా? అంటూ జగన్ క్వశ్చన్ చేశారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాని జగన్ రాసుకొచ్చారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారన్నారు. తప్పులు చేసిన వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక పోతున్నారన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులకు దిగుతున్నారన్నారు జగన్. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.