టీడీపీలోకి మాజీ మంత్రి బాబుమోహన్..! ఎన్టీఆర్ భవన్‌లో బాబుతో భేటీ

www.mannamweb.com


రాజకీయ జన్మనిచ్చిన టీడీపీలో తిరిగి సినీనటుడు బాబుమోహన్ చేరబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

చేరిక ఇక లాంఛనమేనని పార్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. బాబుమోహన్‌కు ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. 1999 ఎన్నికల్లో ఆయనకు మెదక్ జిల్లా ఆందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టికెట్ ఇవ్వగా విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అనంతర పరిణామాలతో బీఆర్ఎస్‌లో చేరారు. 2004, 2014లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోయారు. పార్టీపై గుర్రుగా ఉండి బీజేపీకి రాజీనామా చేసి గతేడాది మార్చి 4న ప్రజా శాంతి పార్టీలో చేరారు. తిరిగి టీడీపీలో చేరేందుకు బాబుమోహన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

చేరికలకు పార్టీ అధినేతకు గ్రీన్ సిగ్నల్

ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. బాబుమోహన్ సైతం భవన్‌కు వచ్చి బాబుతో భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలు చర్చించారు. త్వరలోనే టీడీపీలో బాబుమోహన్ చేరనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎప్పుడు చేరేది త్వరలోనే క్లారిటీ రానున్నట్టు సమాచారం. పార్టీ బలోపేతంపై అడుగులు వేస్తున్న అధిష్టానం..ఆ దిశగా ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనలో బాబు మోహన్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. గతంలో పార్టీని వీడిన వారితో ఇప్పటికే కొంతమందితో మాట్లాడినట్టు సమాచారం. ఎవరెవరు పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.