‘మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్’ లో కీలక మార్పు.. ఇకపై..

హిళల సాధికారతలో భాగంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, దిల్లీ, పంజాబ్, జమ్ము కాశ్మీర్, మహారాష్ర్ట..


తదితర రాష్ట్రాల్లోని మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నాయి. ఈ పథకాన్ని తొలిసారిగా దిల్లీలో అమలు చేశారు. 2019లో ఆనాటి కేజ్రీవాల్ సర్కార్.. దిల్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘మహిళా సమ్మాన్ యోజన’ పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఈ పథకం విజయవంతం కావడంతో పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.

అయితే దిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టింది. పింక్ సహేలీ స్మార్ట్ కార్డు పేరుతో ఈ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఉచితంగా దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(DTC) పరిధిలోని అన్ని బస్సుల్లో ప్రయాణించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా నవంబర్ 2 ఆదివారం రోజున ప్రారంభించారు. ఇది మహిళలకు గౌరవంగా ఆమె అభివర్ణించారు. దేశ రాజధానిలో మహిళలు పింక్ స్మార్ట్ కార్డ్ సాయంతో ఉచితంగా బస్సు సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు.

అనంతరం దిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ” దిల్లీ ప్రభుత్వం పింక్ సహేలీ స్మార్ట్ కార్డును మహిళలు, ట్రాన్స్ జెండర్స్ కోసం తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి కుమార్తెలు, సోదరీమణులు, తల్లులు.. ఎవరైతే 12 సంవత్సరాలు దాటినవారు డీటీసీ అలాగే క్లస్టర్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు” అని ఎక్స్ లో పోస్టు చేశారు. పింక్ సహేలీ స్మార్ట్ కార్డు మహిళా సాధికారతలో కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 2019 లో దిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభం అయింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.