మన దేశంలో నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కఠినమైన పరీక్ష ఏదైనా ఉందా అంటే.. అది యూపీఎస్సీ బోర్డు నిర్వహించే సివిల్స్ పరీక్ష. ఇది ఎంతో కఠినమైన ఎగ్జామ్ మాత్రమే కాక.. దీని కోచింగ్ కూడా చాలా ఖరీదైనది. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే పేద, మధ్యతరగతి వారు అంత ఖర్చు భరించలేరు. మరి అలాంటి వాళ్లు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చేయాలి.. అదుగో వారి కోసమే ఈ ఆఫర్. సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని భావించే వారికి హైదరాబాద్ లో ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఓ యూనివర్శిటీ ముందుకు వచ్చింది. మరి మీరు కూడా సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని భావిస్తున్నారా.. అయితే ఈ ఉచిత కోచింగ్ ఆఫర్ ను వినియోగించుకోండి. ఇంతకు దీనికి అర్హులెవరు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లకి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ బంపరాఫర్ ప్రకటించింది. 2025 సంవత్సరంలో నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ కం మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (ఆర్‌సీఏ)లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు మౌలానా ఆజాద్ యూనివర్శిటీ సిద్ధమవుతుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఫ్రీ కోచింగ్ ఆఫర్ కు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు సెప్టెంబర్ 20, 2024వ తేదీని లాస్ట్ డేట్ గా నిర్ణయించారు.
ప్రవేశ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు మౌలానా యూనివర్శిటీ.. ఉచిత కోచింగ్‌తో పాటు వసతి సౌకర్యం కూడా కల్పించనుంది. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్)-2025 కోచింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.
ఫ్రీ కోచింగ్ కు సంబంధించి ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 27, 2024.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 20, 2024.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ కం మెయిన్స్)-2024
కోచింగ్ ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 29, 2024.
రిజల్ట్స్ డేట్: అక్టోబర్ 04, 2024.
ఇంటర్వ్యూ జరిగే తేదీలు: అక్టోబర్ 15 నుంచి 18, 2024 వరకు
తుది ఫలితాల వెల్లడి తేదీ: అక్టోబర్ 21, 2024.
అడ్మిషన్స్ కు లాస్ట్ డేట్: అక్టోబర్ 25, 2024.
క్లాస్ లు స్టార్ట్ అయ్యే రోజు: అక్టోబర్ 28, 2024.