ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటింది. ఇప్పటివరకూ సూపర్ సిక్స్ హామీల్లో కొన్ని అమలు చేసిన ప్రభుత్వం మిగతావి అమలు చెయ్యడంలో కొంత వెనకబడుతోంది.
ముఖ్యంగా ఉద్యోగాల కల్పన సరిగా లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పారు గానీ.. ఇంతవరకూ ఈ పథకాన్ని అమలు చెయ్యలేదు. ఎందుకంటే.. ఖజానాలో భారీగా డబ్బు లేదు. ఉన్న మనీనే సర్దుబాటు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. వారికి ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ పధకం అమలు చేస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు నెలకు 500 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తామని తెలిపారు. ఈ మంచి నిర్ణయం వల్ల చేనేత రంగం కొంత బలపడగలదు. చేనేత కార్మికులకు కరెంటు బిల్లుల భారం తగ్గి.. వారి జీవితాల్లో కొంత వెలుగు వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ పధకం అమలు వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.85 కోట్ల వరకూ భారం పడుతుంది అని మంత్రి సవిత చెప్పారు. ఐతే.. ఈ భారం పడకుండా కూడా చేసుకోవచ్చు. ఏపీలోని అన్ని ప్రభుత్వ భవనాలపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూర్య ఘర్ యోజనను అమలు చేస్తే.. ఉచితంగా విద్యుత్ ఉత్పత్తి కాగలదు. అలాగే ఏపీలోని అన్ని ఆర్టీసీ భవనాలు, తిరుమల భవనాలు వంటి ఎన్నో భవనాలపై ఈ పథకాన్ని అమలుచేస్తే.. భారీగా విద్యుత్ ఉత్పత్తి కాగలదు. అలాగే.. అన్ని సాగునీటి కాలువలపైనా సోలార్ ప్యానెళ్లు వేస్తే.. విద్యుత్ ఉత్పత్తి అయ్యి.. సాగు నీరు ఆవిరి అవ్వకుండా ఉండగలదు. ఇలాంటి పనులు చెయ్యడం ద్వారా ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసి.. చేనేతలకు ఇవ్వొచ్చు. తద్వారా ఖజానాకి మనీ మిగులుతుంది. దాని ద్వారా నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,500 వంటి పథకాలు అమలు చెయ్యవచ్చు. అలాగే సూర్య ఘర్ యోజన పథకాన్ని ఉపయోగించి నేతన్నల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తే.. అప్పుడు వారికి నెలకు 300 యూనిట్ల కరెంటు ఉత్పత్తి కాగలదు. తద్వారా ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అధికారులు ఇలాంటి ప్లాన్స్ ఆలోచించాలి. తద్వారా ప్రభుత్వంపై పథకాల భారాన్ని తగ్గించగలరు.
చేనేతలకు ఆసరా:
చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా.. మగ్గం కలిగివున్న 93వేల కుటుంబాలు, మర మగ్గాలు కలిగివున్న 10,534 కుటుంబాలు లబ్ది పొందుతాయి. చేనేతలను ఆదుకునే క్రమంలో 50 ఏళ్ళు నిండిన నేత కార్మికులకు నెలకు రూ.4వేల పెన్షన్ ఇస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. ఇలా రాష్ట్రంలో 87,280 మంది పెన్షన్లు పొందుతున్నారని తెలిపారు. అంతేకాదు.. ప్రభుత్వం మరో మంచి పని కూడా చేస్తోంది. నేత కార్మికులకు నిరంతరం పని ఉండేలా.. టాటా తనేరియా, కోఆప్టెక్స్, బిర్లా ఆధ్యం వంటి సంస్థలతో డీల్స్ కుదుర్చుకుంది. ఈ సంస్థలు.. నిరంతరం నేతన్నలకు ఆర్డర్స్ ఇస్తుంటాయి. అలాగే ప్రభుత్వం అప్పుడప్పుడూ చేనేతల వస్త్ర ప్రదర్శన ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది. ఇవి కూడా చేనేత వస్త్రాల అమ్మకాల్ని కొంత పెంచుతున్నాయి. ఇలాంటి చర్యలు.. నేతన్నల జీవితాల్లో ఒకింత వెలుగును తెస్తున్నాయి.


































