దీపం-2 పథకంలో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఒక్కసారిగా కూడా బుక్ చేసుకోనివారు.. ఈ నెలాఖరులోగా చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు.
లేదంటే మూడు ఉచిత సిలిండర్లలో.. ఒకటి కోల్పోతారని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతుందని వివరించారు.
48 గంటల్లో రాయితీ జమ..
సూపర్-6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకం కింద.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నారు. వారిలో 94 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు జమ చేసినట్లు గౌర్ తెలిపారు. ఇంకా 14 వేల మందికి సబ్సిడీ చెల్లింపులు పూర్తి కాలేదని వెల్లడించారు.
50 లక్షల మంది దూరం..
రాష్ట్ర వ్యాప్తంగా 1,100 డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ద్వారా.. 1.55 కోట్ల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయి. అందులో 1.47 కోట్లు మంది తెల్ల రేషన్ కార్డుల వినియోగదారులు ఉన్నారు. అందులో 97 లక్షల మందే ఉచిత గ్యాస్‌ను బుక్ చేసుకున్నారు. దాదాపు 50 లక్షల మంది ఉచిత గ్యాస్ బుకింగ్‌కు దూరంగా ఉన్నారు.
కొత్త కనెక్షన్ల కోసం..
తెల్ల రేషన్ కార్డు లేనివారిలో కూడా పేదలు ఉన్నప్పటికీ వారు ఉచిత గ్యాస్ పథకానికి అనర్హలుగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు విడిపోయిన వారు, నూతనంగా పెళ్లైన వారు.. ఇలా కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. 64 వేలకు పైగా దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో చాలా మంది ఉచిత గ్యాస్‌కు దూరం అవుతున్నారు.
ఈకేవైసీ సమస్య..
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేయడంతో.. ప్రజలకు కష్టాలు ప్రారంభమైయ్యాయి. 2024 నవంబర్ నాటికి ఈకేవైసీకి దూరంగా 20 లక్షల వినియోగదారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉండగా అందులో నేటికీ సుమారు 20 లక్షలకుపైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. 2024 అక్టోబర్ నుంచి ఈకేవైసీ నమోదు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా అనేక మంది ఉచిత గ్యాస్‌కు దూరం అవుతున్నారు.
అమలు ఇలా..
1.ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో.. మొదటిది మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు.
2.ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీడియడ్లుగా పరిగణిస్తారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు, మూడో బ్లాక్ పీరియడ్ డిసెంబరు 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది.
3.గ్యాస్ బుకింగ్ చేసుకోగానే లబ్దిదారుని ఫోన్ నెంబరుకు ఒక మేసేజ్ వెళుతుంది.
4.బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు.
5.గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోని నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తున్నారు.
6.ఈ పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే.. టోల్ ఫ్రీ నంబర్ 1967 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.