Free Sand: అందరికీ ఉచిత ఇసుక … 8 నుంచి అమలు. మార్గదర్శకాలు సిద్దం

www.mannamweb.com


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో ఆ శాఖ అధికారులు ఈ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో ‘ముఖ్య’నేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని రూ.వేల కోట్లు దోచుకున్నారు. వైకాపా దోపిడీని, ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి నేతలు.. తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన వెంటనే కీలక ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల వరకు ఉన్న గుత్తేదారులు రాష్ట్రంలో వివిధ నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వచేశారు. ఇప్పుడు తొలుత మూడు నెలలపాటు దీనిని ఉచితంగా అందజేయనున్నారు. అలాగే బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. వీటి తవ్వకాలకు, నిల్వ కేంద్రాలకు తరలించేందుకు అయిన ఖర్చును మాత్రమే తీసుకోనున్నారు. ఆ ఖర్చు ఎంత అనేది ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నిర్ణయిస్తారు. సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఇసుక అందజేయనున్నారు.

చంద్రబాబు కీలక ఆదేశాలు
ఉచిత ఇసుక విధానం అమలుపై చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు. ఆయన తొలుత మంగళవారం సచివాలయంలో గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ కార్యదర్శి యువరాజ్, సంచాలకుడు ప్రవీణ్‌కుమార్‌లతో సమావేశం నిర్వహించి, ఉచిత ఇసుక విధానం అమలుకు మరిన్ని వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు సమగ్ర సమాచారంతో బుధవారం సీఎం వద్ద జరిగిన సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 8 నుంచే ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటుచేసి పర్యవేక్షించడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎలా ఇసుక అందజేయాలి.. తదితరాలపై ఆయన దిశా నిర్దేశం చేశారు.

రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశం అనంతరం.. ఆ శాఖ సంచాలకుడు ప్రవీణ్‌కుమార్‌.. అన్ని జిల్లాల గనులశాఖ డీడీలు, ఏడీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉన్న నిల్వ కేంద్రాలను వెంటనే పరిశీలించి, ఎంత ఇసుక ఉందో లెక్కలు వేసి, గురువారం సాయంత్రానికి నివేదిక పంపాలని కోరారు. అన్ని నిల్వ కేంద్రాల్లోనూ కలిపి తొలుత 40 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నట్లు భావించినప్పటికీ.. తాజాగా ఎంత ఉందనేది లెక్క తేల్చనున్నారు. అలాగే వివిధ బ్యారేజీలు, రిజర్వాయర్ల పరిధిలో 70-75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక పూడిక రూపంలో ఉన్నట్లు గుర్తించారు. దీనిని వెలికితీసి ఈ మూడు నెలలు ఉచితంగా ఇవ్వనున్నారు. వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోవడంపై ఆలోచనలు చేస్తున్నారు. అలాగే ప్రస్తుత గుత్తేదారులైన జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థల ప్రతినిధులతో ప్రవీణ్‌కుమార్‌ గురువారం సమావేశం నిర్వహించనున్నారు.

ఐదేళ్లలో కనీవినీ ఎరగని దోపిడీ
జగన్‌ ప్రభుత్వంలో జరిగిన ఇసుక దోపిడీ కనీవినీ ఎరుగనది. గత ప్రభుత్వం తొలుత టన్ను ఇసుక రూ.375, తర్వాత రూ.475 చొప్పున విక్రయించింది. ఊరూపేరులేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి, వాటిపేరిట ‘ముఖ్య’నేతలే నేరుగా ఇసుక వ్యాపారంచేసి రూ.వేల కోట్లు పోగేసుకున్నారు. ట్రాక్టర్‌ ఇసుక కావాలంటే రూ.10 వేలు, లారీ లోడు కావాలంటే రూ.25-30 వేలు వెచ్చించాల్సినంతలా ధరలు పెంచేశారు. దీంతో గత ఐదేళ్లూ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైంది. నదుల్లో తవ్వకాలకు అనుమతులు లేకపోయినా, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్‌జీటీ హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా ఇసుక అక్రమ తవ్వకాలు సాగించారు. దీనికి అప్పటి గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆశాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి సంపూర్ణ సహకారం అందించారు. అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా గనులశాఖ అధికారులను వాటి జోలికి వెళ్లనివ్వకుండా వెంకటరెడ్డి హుకుం జారీచేశారు. నేరుగా సీఎం కార్యాలయం నుంచే పర్యవేక్షణ ఉండటంతో అన్ని శాఖల అధికారులూ మిన్నకుండిపోయారు.