వైసీపీ పెట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలిన సంవత్సరం 2024 అనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన వైసిపి 2024లో కుప్ప కూలింది.
వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు సిద్ధమంటూ వెళ్లిన జగన్ అండ్ కో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను సాధించలేకపోయింది. ఏడాది ముగుస్తున్నా ఇప్పటికీ కొందరు నేతలు ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు.
వైసిపి చరిత్రలో అతిపెద్ద షాక్ 2024
వైసీపీ స్థాపించాక జగన్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో జైలుకు సైతం వెళ్ళొచ్చారు. 16 నెలలు బయట లేకపోయినా జగన్పై పార్టీ కేడర్ విశ్వాసం కోల్పోలేదు. చెల్లెలు షర్మిల, అమ్మ విజయమ్మ అండగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితమైనా జగన్ చెలించలేదు. అప్పట్లో ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు టిడిపిలోకి జంప్ చేసినా పాదయాత్రతో ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారు.
ఒక్క ఛాన్స్ నినాదంతో 2019లో విజయం సాధించారు జగన్. అయితే ఐదేళ్లు సంక్షేమం మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టడం, మంత్రులకు ఎమ్మెల్యేలకు అందుబాటులో లేక పోవడం, సలహాదారుల పెత్తనం ఎక్కువైపోవడం జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు దూరం చేశాయి. జగన్ మెప్పు పొందడానికి కొంతమంది నేతలు వాడిన భాష ప్రజల్లో పార్టీని చులకన చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టడం, పవన్ వ్యక్తిగత జీవితంపై నోటికి వచ్చినట్టు మాట్లాడటం, 3 రాజధానుల ప్రహసనం వైసీపీ పట్ల ఓటర్లలో విముఖత ఏర్పడేలా చేసాయి. దానితో పది- పదిహేను ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యతిరేకతను జగన్ ప్రభుత్వం కేవలం 5 ఏళ్లలోనే మూట కట్టుకుంది. తక్కువలో తక్కువ 90 నుంచి 100 సీట్లు వస్తాయని అంచనాలు వేసిన వైసీపీ పెద్దలను షాక్కు గురి చేస్తూ 2024లో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించగలిగింది.
ఎన్నికల తర్వాత మొదలైన కష్టాలు
2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి నేతలు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారంటూ జగన్పై తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతూ ఆయన బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి, సన్నిహితులు మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల నాని సహా సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య, అవంతి శ్రీనివాస్, గ్రంధి శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ లాంటి కీలక నేతలు పార్టీని వదిలిపెట్టారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన చాలామంది కేసులు ఎదుర్కొంటుంటే మరి కొందరు వాటికి భయపడి పరారీలో ఉన్నారు.
ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, ఏకగ్రీవంగా ఎన్నిక
ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే వారు ఎదుర్కొంటున్న ఆరోపణలకు, కేసులకు ప్రజల నుంచి సానుభూతి దక్కడం లేదు. జగన్ పాలనపై కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ కూడా స్వయంగా జగనే ఇచ్చుకోవాల్సి వస్తుంది. వైసిపి ట్రబుల్ షూటర్లగా పేరున్న కీలక నేతలు వారి వారి వ్యక్తిగత ఇబ్బందులు, కేసులతో తమపాట్లు తాము పడుతున్నారు. దీనితో ఎలా చూసినా 2024 వైసీపీకి ఒక పీడకలే అని చెప్పాలి.
2025 పైనే ఆశలన్నీ
ప్రస్తుతం వైసీపీ ఆశలన్నీ 2025 పైనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటిపోవడంతో వారు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారంటూ ప్రజలతో కలిసి పోరాటం చేయడానికి జగన్ పిలుపునిచ్చారు. కొత్త ఏడాది ఆరంభం నుంచే ప్రజల్లో ఉండడానికి ఆయన రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో సీట్లపరంగా చాలా తక్కువే వచ్చినా ఓట్ షేర్ 40శాతం ఉండడం జగన్కు భరోసా ఇస్తోంది. దానితోనే ప్రభుత్వంపై పోరాటానికి ఆయన రెడీ అవుతున్నారు. 2019 లో జగన్ కు ప్రజల నుంచి లభించిన సానుభూతి, మద్దతు కొత్త ఏడాదిలో ఆయనకు దక్కుతుందో లేదో చూడాలి.