అక్టోబరు 17న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ..

www.mannamweb.com


తిరుమలలో ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. రేపు (అక్టోబర్‌17న) పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఇక, దసరా పండగ సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లనీ నిండి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచిఉన్నారు. దీంతో టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా, దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తున్నది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుంది.

ఇక సోమవారం అర్ధరాత్రి వరకు 75,361 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,850 మంది భక్తులు తలనీలాలు సర్పించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.61 కోట్ల ఆదాయం సమకూరినట్టుగా టీటీడీ వెల్లడించింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తుల నమ్మకం.