తమిళనాడు లో ‘గేమ్ చేంజర్’ విడుదలకు అడ్డంకి..సినిమాని బ్యాన్ చెయ్యాలంటూ ‘ఇండియన్ 2’ నిర్మాతలు డిమాండ్!

www.mannamweb.com


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ చేంజర్(Game Changer)’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ నేపథ్యం లో ఇప్పుడు ఈ చిత్రానికి తమిళనాడు ప్రాంతం లో ఒక సరికొత్త అడ్డంకి ఏర్పడింది. అదేమిటంటే శంకర్ గత చిత్రం ‘ఇండియన్ 2 (indian 2)’ ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అసలు గత ఏడాదే విడుదల అవ్వాల్సిన ‘గేమ్ చేంజర్’ చిత్రం కేవలం ‘ఇండియన్ 2’ కారణంగానే విడుదల అయ్యేందుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. ఇండియన్ 2 నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధినేత డైరెక్టర్ శంకర్ పై కేసు పెట్టడం, తమ సినిమాని పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వీలు లేదంటూ మొండిపట్టు పట్టి కోర్టు లో కేసు వేసి,మొత్తానికి ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేయించుకున్నారు.

కానీ ఆ చిత్రం శంకర్ కెరీర్ లోనే ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోయింది. అయినప్పటికీ ‘ఇండియన్ 3 ‘ చిత్రం పూర్తి చేస్తానని, కేవలం ఇది థియేటర్స్ లో మాత్రమే విడుదల అవుతుందని, అందరూ అనుకుంటున్నట్టు ఓటీటీ లో నేరుగా విడుదల అవ్వదని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు ‘ఇండియన్ 3’ పూర్తి చేసేవరకు శంకర్ కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ ని విడుదల చేయడానికి వీలు లేదని తమిళనాడు ఫిలిం కౌన్సిల్ ని సంప్రదించారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. వాస్తవానికి లైకా ప్రొడక్షన్స్ సంస్థ నుండి అజిత్ హీరో గా నటించిన ‘విడామూయార్చి’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాలి. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ‘గేమ్ చేంజర్’ కి తిరుగేలేదు అని అభిమానులు, ఈ చిత్ర పంపిణీదారులు సంతోషిస్తున్న ఈ సమయంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇలా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 2 ‘ బయ్యర్స్ కి దారుణమైన నష్టాలను మిగిలేలా చేసింది, అంతే కాకుండా సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన ‘విడాముయార్చి(Vidamuyaarchi)’ చిత్రాన్ని ఎలాంటి సమాచారం అందించకుండా వాయిదా వేసినందుకు బయ్యర్లు దారుణంగా నష్టపోయారు. థియేటర్స్ కి అడ్వాన్స్ లు కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో విడుదలని ఆపేస్తామని హెచ్చరిస్తే అసలు ఊరుకోబోమని, ఎంత దూరమైనా వెళ్తామని ‘గేమ్ చేంజర్’ తమిళనాడు పంపిణీదారులు లైకా ప్రొడక్షన్స్ సంస్థకి హెచ్చరికలు జారీ చేసారు. మరి గేమ్ చేంజర్ కి స్మూత్ రిలీజ్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి పెద్ద సస్పెన్స్. చూడాలి మరి రాబోయే రెండు రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.