మసీదుల్లో వినాయక విగ్రహాలు.. 44 ఏళ్ల ఈ చరిత్ర గురించి తెలుసా?

www.mannamweb.com


ఎన్ని యుగాలు మారినా, తరాలు మారినా.. దేశంలో మత వివక్షత అనేది నానాటికి రావణకాష్టంలా రగులుతునే ఉంది. అసలు మతం అనేది ఆధ్యాత్మిక విశ్వాసం, నమ్మకం తప్ప మనుషుల మధ్య భిన్న అభిప్రాయాలు, కలతలు తెచ్చేది కాదు. అందుకే నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాలను గౌరవించు అని పెద్దలు అంటారు. కానీ, ప్రస్తుతం కాలంలో ఈ సిద్ధాంతం ఎవరూ ఆచరించడం లేదు సరి కదా.. మతాల పేరుతో మనుషుల ప్రాణాలను బలికొంటున్నారు. ముఖ్యంగా దేశంలో హిందు, ముస్లిం వర్గాల మధ్య విభేదాలు మునపటి కంటే ముదురుతున్నాట్లే కనిపిస్తోంది.

కానీ, తాజాగా జరిగిన ఓ సంఘటనలో మాత్రం.. హిందు, ముస్లిం అనేది ఒక మతం కాదు..ఐకమత్యం అని, నిదర్శనంగా కొంతమంది ముస్లింలు నిరూపించారు. ఇంతవరకు ఎక్కడ కని విని ఎరగని విధంగా మసీదులో వినాయకుడిని ప్రతిష్టించి నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ, ఇది నిజంగానే జరిగింది. ఇంతకీ ఎక్కడ జరిగింది, దీని వెనుక ఉన్న కథంటో తెలుసుకుందాం.

ఇప్పటి వరకు ముస్లిం, హిందువులతో కలిసి పూజల్లో పాల్గొనడం, పూజలు చేయడం వంటి వింతలు దేశంలో చూసి ఉంటాం. కానీ, మొదటిసారి హిందువులు జరుపుకున్న గణేశ్ ఉత్సవాలు ఓ మసీదులో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఆశ్చర్యమైన ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో సాంగ్లీ జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చూస్తే.. హిందూ, ముస్లింలు సోదరభావలతో కలిసి జీవించే కొన్ని సంప్రదాయాలు కనిపిస్తాయి. ఎందుకంటే.. ఇక్కడ కొన్ని మసీదుల్లో 40 ఏళ్లకుపైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతోంది. ముఖ్యంగా సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలో గోట్‌ఖిండీ అనే గ్రామం ఉంది.

ఇక్కడ జుజర్ చౌక్‌లో ఉన్న మసీదులో ప్రతీ ఏడాది పది రోజుల పాటు గణేశ్ మండలి వారు గణపతిని ప్రతిష్టిస్తారు. ఈ సంప్రదాయం 44 ఏళ్లుగా జరుగుతునే ఉంది. పైగా ఇక్కడ గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో హిందూ, ముస్లింలు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ గ్రామంలో మసీదులో గణపతిని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు. ఇలా చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా అనే సందేహం మీకు కలిగిందా.. మరీ దీని వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మసీదులో గణపతి ప్రతిష్ఠ వెనుక చరిత్ర

గోట్‌ఖిండీ గ్రామంలో మసీదులోని గణపతి ప్రతిష్ఠ వెనుక సంప్రదాయంగా కొనసాగుతున్న ఓ కథ ఉందని ఆ ప్రాంతపు వాసి ఆశోక్ పాటిల్ అనే వ్యక్తి స్థానిక మీడియాతో వెల్లడించారు. ఆ గ్రామంలో ఓసారి ప్రధాన కూడలి వద్ద, చాలా సాదాసీదా ఏర్పాట్లతో వినాయకుడిని ఏర్పాటు చేశారని, అప్పట్లో మండపం కూడా వేయలేదని ఆయన తెలిపారు.అయితే గణేశ్ ఉత్సవాలు ప్రతిఏటా వర్షాకాలంలోనే జరుగుతాయనే విషయం తెలిసిందే. అలా ఓ రోజు వినాయకుడిని ఏర్పాటు చేసిన తర్వాత భారీ వర్షం కురిసింది. ఇక మండపం లేకపోవడంతో.. వర్షానికి వినాయకుడి విగ్రహం అంతా తడిచిపోయింది. అయితే గ్రామానికి చెందిన ఓ ముస్లి వ్యక్తి ఈ దృశ్యన్ని చూసి.. గణేశ్ మండల్‌కు చెందిన వ్యక్తులకు చెప్పారు.

వెంటనే వారందరూ అక్కడికి చేరుకొని, ఏం చేయాలో అని సమస్యకు పరిష్కారం కోసం చర్చించారు. అప్పుడే నిజామ్ పఠాన్, ఆయన బంధువలు వర్షంలో పూర్తిగా తడిచిపోయిన వినాయకుడి విగ్రహాన్ని దగ్గరలోని మసీదులో ఉంచాలని కోరారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న వారంతా ఆలోచించి, గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు. ఈ క్రమంలోనే నిమజ్జనం వరకు ఆ ఏడాది వినాయకుడిని ఆ మసీదులోనే ఉంచి పూజలు చేశారు అని అశోక్ పాటిల్ తెలిపారు. అయితే ఇదంతా 1961లో జరిగిందని తెలిపారు.కానీ, ఆ తర్వాతి ఏడాది గణపతిని మళ్లీ ప్రతిష్టించలేదని చెప్పారు.

ఇక అక్కడికి కొన్నేళ్ల తర్వాత.. 1986లో ఇదే గ్రామానికి చెందిన కొందరు యువకులు పొరుగున ఉన్న బావ్చీ గ్రామంలో గణేశ్ ఉత్సవాల కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లారు. అయితే అక్కడ హిందూ, ముస్లిం వర్గాలకు చెందినవారు ఆ కార్యక్రమంలో కలిసి పాల్గొనడాన్ని వారు గమనించారు. దీంతో వారు కూడా ఆలోచనలో పడ్డారు. మనం కూడా గ్రామంలో ఇదే విధంగా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని ఆ యువకులు అనుకున్నారట. దీంతో 1961 నాటి సంఘటనను వారంత గుర్తుకు తెచ్చుకొని వినాయకుడిని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆ నాటి నుంచి నేటి వరకు తరతరాలుగా ఈ సంప్రదాయం గ్రామంలో కొనసాగుతునే ఉంది.