Ganga jal: కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి ఎందుకు తీసుకెళ్లరు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?

Ganga jal: కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి ఎందుకు తీసుకెళ్లరు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?


Ganga jal: హిందూమతంలో నదులను దేవతలుగా భావిస్తారు. ఒక్కో నదికి భిన్నమైన గౌరవం ఉంటుంది. అన్నింటికంటే అత్యంత పవిత్రమైనది గంగా నది. ప్రతి ఒక్కరూ గంగా జలాన్ని పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

పాపాలను కడిగి ఆత్మను శుద్ధి చేయగల సామర్థ్యం గంగా జలానికి ఉందని నమ్ముతారు.

ఆత్మకు మోక్షం ఇచ్చేందుకు చనిపోయిన వారి అస్థికలు గంగా జలంలో కలుపుతారు. ఇంటి చుట్టూ గంగా జలాన్ని చల్లుకోవడం వల్ల ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని నమ్ముతారు. గంగాజలాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకుంటారు. భక్తుల ప్రతిరోజు పూజ చేసిన తర్వాత వెంటనే ఇంటిని శుద్ధి చేసుకునేందుకు చల్లుకుంటారు. అలాగే తమని తాము శుభ్రపరుచుకునేందుకు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకుంటారు. పూజ గదిలో దేవతలకు గంగా జలంతో అభిషేకం చేస్తారు.

హరిద్వార్ గంగాజలం పవిత్రం

జననం, వివాహం, మరణ ఆచారాలలో గంగా జలం వినియోగిస్తారు. మరణించిన వ్యక్తి నోట్లో గంగా జలాన్ని పోయడం వల్ల ఆత్మ స్వర్గానికి చేరుకుంటుందని నమ్ముతారు. గంగా జలాన్ని ఇంటికి తీసుకొచ్చి భద్రపరుచుకుంటారు. అయితే ఎక్కువగా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చుకుంటారు. హిందూమతంలోని ఏడు పవిత్ర ప్రదేశాలలో హరిద్వార్ ఒకటి.

హరిద్వార్ లో ఉన్న గంగా జలం మీద చాలా పరిశోధనలు జరిగాయి. ఈ నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని కూడా చెప్తారు. హరిద్వార్ లోని హరికి పౌరీ ఘాటు ఉంది. ఇక్కడ విష్ణువు తన పాదముద్రను విడిచిపెట్టాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే హరిద్వార్ వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి గంగా జలాన్ని తీసుకెళ్తారు. భక్తులు తమ కుటుంబం, స్నేహితుల కోసం గంగా జలాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. అయితే కాశీ నుంచి మాత్రం గంగా జలాన్ని పొరపాటున కూడా ఇంటికి తీసుకెళ్లరు.

కాశీ నుంచి ఎందుకు తీసుకెళ్లరు?

ప్రపంచంలోనే పురాతన నగరాలలో ఒకటిగా పరిగణించే పవిత్రమైన నగరం కాశీ. ఈ నగరం గంగానది ఒడ్డునే ఉంది. కానీ ప్రజలు మాత్రం కాశీ నుంచి గంగా జలాన్ని ఇంటికి తీసుకువెళ్లరు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు చాలా దూరం నుంచి చనిపోయిన వారిని మృతదేహాలను మణికర్ణిక ఘాట్ కు తీసుకువస్తారు. కానీ అక్కడ నుంచి గంగా జలాన్ని మాత్రం తీసుకెళ్లరు. దీని వెనుక ఒక కారణం ఉంది.

కాశీలోని మణికర్ణిక ఘాట్ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ దహన స్థలాలలో ఒకటి. ఇక్కడ 24 గంటలు దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ దహనం చేసిన వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. కానీ నిరంతర దహన క్రియల వల్ల గంగా నదిలో బూడిదలు, ఇతర అవశేషాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నీటిని కలుషితం చేస్తుంది. అందుకే కాశీ నుంచి గంగాజలాన్ని ఇంటికి తీసుకువెళ్లరు.

మోక్షం పొందలేరా?

మణికర్ణిక ఘాట్ తో పాటు అక్కడికి దగ్గరలో ఉన్న ఇతర ఘాట్ లో నుంచి కూడా గంగాజలాన్ని ఇంటికి తీసుకువెళ్లరు. ఎందుకంటే చనిపోయిన వారి అస్థికలు గంగా నదిలో కలపడం వల్ల అవి ఒక చోట నుంచి మరొక చోటుకు ప్రవహిస్తాయి. ఏదో ఒక రూపంలో బూడిద అవశేషాలు నీటిలో ఉంటాయి. అందువల్లే వీటిని ఇంటికి తీసుకు వెళ్లకుండా ఉండటమే మంచిదిగా భావిస్తారు.

మోక్షాన్ని పొందేందుకు చనిపోయేలోపు ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. అలాగే చనిపోయిన వారి ఆత్మ శాంతించేందుకు వారి అస్థికలను గంగా నదిలో కలుపుతారు. కాశీలో ఉన్న గంగా జలంలో మరణించిన వారి ఆత్మ భాగాలు, బూడిద లేదా అవశేషాలు ఉంటే అవి వారి మోక్ష యాత్రలో అడ్డంకిగా ఉంటాయి. కాశీ నుంచి తీసుకువెళ్లడం వల్ల మరణం, పునర్జన్మ చక్రానికి అంతరాయం ఏర్పడుతుంది. ఆత్మ పూర్తిగా మోక్షాన్ని పొందలేకపోవచ్చు. దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి. అందుకే గంగాజలాన్ని ఎక్కువగా హరిద్వార్ నుంచి మాత్రమే తీసుకొని వెళ్తారు. కాశీ నుంచి పొరపాటున కూడా గంగా జలాన్ని ఇంటికి తీసుకొనివెళ్లరు.