Ganja Chocolates: గంజాయి మత్తు దేశాన్ని పట్టి పీడిస్తోంది. మెట్రో నగరాలతోపాటు మారుమూల పల్లెల్లోనూ గంజాయి దందా విచ్చలవిడిగా సాగుతోంది. యువతి, యువకులే టార్గెట్ గా చేసుకుని స్మగ్లర్లు లక్షల్లో సంపాధిస్తున్నారు.
పోలీసులు కట్టుదిట్టమైన నిఘా పెట్టినా.. వివిధ రూపాల్లో సరాఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాక్లెట్ (Chocolate) ల రూపంలో గంజాయిని విక్రయిస్తుండగా ఇది తిన్న స్కూల్ పిల్లలు.. క్లాస్ రూమ్ లోనే రెచ్చిపోయి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన రంగారెడ్డి (Ranga reddy) జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (School) చోటుచేసుకుంది.
క్లాస్‌రూమ్‌లో మత్తెక్కి పడిపోవడం..
ఈ మేరకు పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ మధ్య అబ్బాయిలు వింతగా ప్రవర్తించడం గమనించాం. బెంచీలపై పడుకోవటం, క్లాస్‌లోనే మూత్రవిసర్జన చేయటం, బాలికల ముందు అసభ్యంగా ప్రవర్తించటం చేస్తున్నారు. అలా ఒకరిద్దరు చేస్తే బెదిరించి వదిలేశాం. కానీ రోజు రోజుకు చాలా మంది అలాగే ప్రవర్తించటంతో తమకు అనుమానం వచ్చిందని హెడ్‌మాస్టర్ అంగూర్ నాయక్ చెప్పారు.
కదలికలపై నిఘా..
ఈ క్రమంలోనే పిల్లల కదలికలపై నిఘా పెట్టాం. వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటూనే ఏలాంటి పనులు చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కనుక్కున్నాం. అయితే ఒక అబ్బాయి చాక్లెట్లు తీసుకొచ్చి తింటూ క్లాస్‌రూమ్‌లో మత్తెక్కి పడిపోవడం గుర్తించాం. ఆ చాక్లెట్లు మేము తిని రుచి చూస్తే అసలు విషయం బయటపడింది. గంజాయి కలిపిన చాక్లెట్స్ తింటున్నారని గుర్తించి.. ఎక్కడ దొరుకుతాయో వివరాలు అడిగాం. దీంతో కొత్తురు పోలీసు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఒక కిరాణాషాపుతో పాటు పాఠశాల పరిసరాల్లో ఉన్న దుకాణాలు, పాన్‌షాప్‌ల్లో మత్తు చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు గుర్తించాం. ఒక్కో చాక్లెట్ రూ.25కు అమ్ముతుండగా.. ప్రతిరోజు చాలా మంది విద్యార్థులతోపాటు పలువురు కొంటున్నట్లు తెలుసుకున్నామని స్కూల్ యాజమాన్యం వివరించింది.
ఎస్‌వోటీ బృందాలతో ప్రత్యేక ఆపరేషన్..
ఇక ఈ విషయంపై వెంటనే డీఈవోతో చర్చించి.. పోలీసు ఉన్నతాధికారుల సహకారంతో నేరుగా శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డికి సమాచారం అందించారు. ఆయన స్థానిక ఎస్‌వోటీ బృందాలతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి గంజాయి చాక్లెట్ల గుట్టు రట్టుచేసినట్లు తెలిపారు. ఒడిశాకు చెందిన వీరేంద్ర బెహరా (33), సోమనాథ్ బెహరా(35), సురిజ్యామిని సాహూ(35) కొత్తూరు మున్సిపాలిటీలో వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ, ఒడిశాలో రూ.9కి గంజాయి చాక్లెట్లను కొని, ‘చార్మినార్ మునక్కా గోల్డ్’ పేరుతో ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు..నిందితులు అరెస్టు చేసిన రిమాండ్‌కు తరలించారు.
సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్..
కొత్తురు పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న’సంతోష్ కిరాణ అండ్ జనరల్ స్టోర్’లో ఏడాది కాలంగా మత్తు చాక్లెట్లను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కిరాణ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా 8 కిలోల గంజాయి చాక్లెట్లు దొరికాయి. పరిసర ప్రాంతాల్లో మరికొన్ని దుకాణాల్లో సైతం పోలీసులు తనిఖీలు నిర్వహించగా మరికొందరు నిందితులు పరారవగా పోలీసులు గాలిస్తున్నారు.
48 గంటల మత్తు..
ఒక చాక్లెట్ తీసుకుంటే సుమారు 48 గంటల వరకు మత్తు ఉంటుందని బాధితులు చెప్తున్నారు. అయితే తాము ఒక చాక్లెట్‌ను నలుగురు షేర్ చేసుకుని తింటే.. కనీసం 12 గంటలపాటు మత్తుగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులే కాకుండా ఆ ప్రాంతంలో ఉండే కార్మికులు, యువత ఈ చాక్లెట్లు తింటున్నట్టు పోలీసులు గుర్తించారు. హెడ్‌మాస్టర్ అంగూర్ నాయక్ గుర్తించకపోతే తమ బిడ్డల పరిస్థితి ఏమయ్యేదోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల కిందటే ఈ పాఠశాలకు వచ్చిన ఆయన తమ పిల్లల భవిష్యత్తు, ప్రాణాలు కాపాడినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ అంగూర్ కు థాంక్స్ చెబుతున్నారు.