ఒకప్పుడు కేవలం జీర్ణ సమస్య ఉన్నవారికే గ్యాస్ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. శిశువులకు కూడా గ్యాస్ సమస్య వస్తోంది. అంటే ఇది ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థమవుతుంది. ప్రస్తుతం చాలా మంది గ్యాస్ ట్రబుల్ తో సతమతం అవుతున్నారు. ఇది ఒక కామన్ సమస్యగా మారిపోయింది. అయితే గ్యాస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఆహారం అనేది ముఖ్య కారణంగా చెప్పవచ్చు. శరీరానికి సరిపడని ఆహారాలను తిన్నప్పుడు అవి సరిగ్గా జీర్ణం అవక గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో గ్యాస్ ట్రబుల్ సమస్య మొదలవుతుంది. అలాగే వేళకు భోజనం చేయకపోవడం, తినే పదార్థాల్లో అసమతుల్యత ఉండడం, అతిగా ఆహారం తీసుకోవడం, శీతల పానీయాలు లేదా మద్యం అధికంగా సేవించడం, పొగ తాగడం వంటివన్నీ గ్యాస్ ట్రబుల్ కు కారణమవుతున్నాయి. శారీరక శ్రమ చేయకపోయినా కూడా గ్యాస్ ఏర్పడుతుంది.
బీన్స్, యాపిల్స్, పప్పు దినుసులు..
బీన్స్, పుట్టగొడుగులు, యాపిల్స్, కొన్ని రకాల పప్పు ధాన్యాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలను తినడం వల్ల కొందరికి సహజంగానే గ్యాస్ సమస్య వస్తుంది. ఇలా గనక జరిగితే ఈ పదార్థాలను తినడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. అలాగే పాలు లేదా పాల ఉత్పత్తులు కొందరికి పడవు. వాటిని తీసుకుంటే వెంటనే పొట్టలో గ్యాస్ ఏర్పడుతుంది. ఇలా గనక జరిగితే పాల ఉత్పత్తులను మానేయాల్సి ఉంటుంది. పాలలో లాక్టోస్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది సరిగ్గా జీర్ణం అవకపోతే పొట్ట ఉబ్బరం ఏర్పడుతుంది. ఫలితంగా గ్యాస్ వస్తుంది. పాలతోపాటు జున్ను, కోడిగుడ్లు తదితర ఆహారాలు కూడా కొందరికి సరిగగ్గా జీర్ణం కావు. ఇవి తిన్న తరువాత 60 నుంచి 90 నిమిషాల లోపు మీకు బాగా గ్యాస్ వస్తుంటే ఈ పదార్థాలన తినడం మానేయాలని గుర్తుంచుకోండి.
ఆలుగడ్డలు, మొక్కజొన్న, గోధుమ పిండి..
పిండి పదార్థాలు అధికంగా ఉండే ఆలుగడ్డలు, మొక్కజొన్న, పిస్తా, గోధుమ పిండి, బ్రెడ్ తదితర ఆహారాలు కొందరికి పడవు. వీటిని తింటే సరిగ్గా జీర్ణం కావు. దీంతో కూడా గ్యాస్ ఏర్పడుతుంది. అదేవిధంగా పీచు అధికంగా ఉండే ఆహారాలను తిన్నా కూడా కొందరికి సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ సమస్య వస్తుంది. ముఖ్యంగా బ్రౌన్ రైస్, బీన్స్, ఓట్స్, గోధుమలు, పలు రకాల పండ్లు, కూరగాయల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం అవక గ్యాస్‌ను కలగజేస్తుంది. కనుక ఈ పదార్థాలతో గ్యాస్ ఏర్పడుతుంటే వెంటనే వీటిని తీసుకోవడం మానేయాలి. లేదంటే సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఉంటాయి.
కొవ్వు పదార్థాలు..
కొవ్వు పదార్థాలు సహజంగానే అందరికీ త్వరగా జీర్ణం కావు. కానీ తరచూ కొవ్వు పదార్థాలను తిన్నప్పుడు సరిగ్గా జీర్ణం అవడం లేదు, గ్యాస్ వస్తుంది అంటే.. ఈ పదార్థాలు పడడం లేదని అర్థం. కనుక ఇలాంటి వారు కొవ్వు పదార్థాలను తీసుకోవడం మానేయాలి. అలాగే ప్రాసెస్ చేయబడిన పాలు, ఇతర ఆహారాలను చాలా మంది నేటి తరుణంలో తింటున్నారు. కానీ ఇవి సరిగ్గా జీర్ణం కావు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఇవి కూడా గ్యాస్ సమస్యను కలగజేస్తాయి. అలాగే బయట బేకరీలలో లభించే పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు కూడా చాలా మందికి జీర్ణం కావు. ముఖ్యంగా జీర్ణం కాని ఆహారాలను తినడం వల్లనే గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. కనుక ఏ ఆహారాలను తింటే గ్యాస్ వస్తుందో గమనించాలి. అప్పుడు ఆ ఆహారాలను మానేస్తే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.