Ghee: నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే
నెయ్యి మన జీవితంలో ఒక భాగమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నారులు తినడానికి మారాం చేస్తే అన్నంలో నెయ్యి వేసి తినిపిస్తుంటారు. పెద్దలు కూడా నెయ్యిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇక ఎన్నో రకాల స్వీట్ల తయారీలో, వంటకాల్లో నెయ్యిని ఉపయోగిస్తారు. ప్యూర్ నెయ్యితో చేసే స్వీట్స్ రుచి మాములుగా ఉండదు. అందుకే నెయ్యిని ఇష్టంగా తింటుంటారు.
అయితే చాలా మంది నెయ్యి తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనే భావనలో ఉంటారు. మరి నిజంగానే నెయ్యి తింటే బరువు పెరుగుతారా.? అసలు నెయ్యితో ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారనేది కేవలం అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.
ముఖ్యంగా రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చుకోవడం ద్వారా రోజంతా చురుకుగా ఉండొచ్చని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా గర్భినీలు నెయ్యి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మాయిశ్చరైజర్‌ను కాపాడుతాయి. దీంతో చర్మం ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖంలో నిగారింపు రావాలంటే ప్రతీరోజూ కచ్చితంగా నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
మహిళలు పీరియడ్స్ సమయంలో నెయ్యిని కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలసరి క్రమంగా రాని వారికి నెయ్యి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో విటమిన్ కే పుష్కలంగా లభిస్తుంది. ఇది కాల్షియం శోషణలో సహాయపడుతుంది. దంత క్షయాన్ని నివారించడానికి, అథెరోస్ల్కెరోసిస్ రాకుండా ఎముకలను బలంగా ఉంచడానికి తోడ్పడుతుంది.