అమ్మాయిలు జాగ్రత్త.. కొంపముంచిన హెయిర్-స్ట్రెయిటెనింగ్.. ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువతి..

జుట్టు అందంగా కనిపించాలనే.. హెయిర్ స్ట్రెయిటెనింగ్ కూడా ఓ యువతిని ఆసుపత్రి పాలు చేసింది.. మీరు వింటున్నది నిజమే.. హెయిర్ స్ట్రెయిటెనింగ్ చికిత్స కోసం వెళ్లిన ఓ 17 ఏళ్ల అమ్మాయి మూత్రపిండాల వైఫల్యంతో ఆసుపత్రిలో చాలా కాలం పాటు చికిత్స తీసుకుంది..


ఈ షాకింగ్ ఘటన ఇజ్రాయెల్ దేశంలో చోటుచేసుకుంది.. దీనికి సంబంధించిన షాకింగ్ నిజాలను జెరూసలేంలోని షారే జెడెక్ మెడికల్ సెంటర్‌ వివరించింది. హెయిర్ స్ట్రెయిటెనింగ్ చికిత్స చేయించుకున్న 17 ఏళ్ల బాలిక తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యంతో ఆసుపత్రిలో చేరిందని షారే జెడెక్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో 25 ఏళ్ల మహిళ కూడా ఒక నెల క్రితం హెయిర్ స్ట్రెయిటెనింగ్ వల్ల మూత్రపిండాల వైఫల్యంతో బాధపడిందని ఆసుప్రతి వర్గాలు తెలిపాయి..

హెయిర్ స్ట్రెయిటెనింగ్ తర్వాత.. వాంతులు, తలతిరుగుడు, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆ బాలిక, పిల్లల విభాగంలో చాలా రోజులుగా తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది.. ఆమె సోమవారం డిశ్చార్జ్ అయ్యింది.. ఆసుపత్రిలోని పీడియాట్రిక్ నెఫ్రాలజీ ఇన్స్టిట్యూట్‌లో అవుట్ పేషెంట్ ఫాలో-అప్‌ను కొనసాగిస్తుందని తెలిపారు.

2023లో ఆసుపత్రి నెఫ్రాలజీ ఇన్‌స్టిట్యూట్ అధిపతి ప్రొఫెసర్ లిండా షావిత్.. ఇన్‌స్టిట్యూట్‌లోని వైద్యుడు డాక్టర్ అలోన్ బెనాయ ప్రచురించిన ఒక అధ్యయనంలో 14 నుండి 58 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎటువంటి అంతర్లీన వైద్య పరిస్థితులు లేకుండా తీవ్రమైన మూత్రపిండ వైఫల్యంతో దేశవ్యాప్తంగా అత్యవసర విభాగాలకు వచ్చిన 26 కేసులను నమోదు చేశారు.

వారందరూ గ్లైయాక్సిలిక్ యాసిడ్ కలిగిన జుట్టు (హెయిర్ స్ట్రెయిటెనింగ్) నిఠారుగా చేసే చికిత్సలు చేయించుకున్నారని పరిశోధకులు కనుగొన్నారు. అప్పటి నుండి ఆరోగ్య మంత్రిత్వ శాఖ గ్లైయాక్సిలిక్ యాసిడ్ కలిగిన డజన్ల కొద్దీ సౌందర్య ఉత్పత్తుల లైసెన్స్‌లను రద్దు చేసింది.

“జుట్టును నిఠారుగా చేసే ఉత్పత్తులను నేరుగా తలకు లేదా జుట్టు మూలాలకు పూయకూడదు.. కానీ వాటి నుండి కనీసం 1.5 సెంటీమీటర్ల దూరం ఉంచాలి” అని షవిత్ చెప్పారు. “అదనంగా, హెయిర్‌డ్రెస్సర్లు, క్లయింట్లు ఇద్దరూ ఉత్పత్తిని వేడి చేయకుండా జాగ్రత్త వహించాలి.. తయారీదారు సూచనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలి.” అని సూచించారు. కాగా.. అందంగా కనిపించాలని హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేసుకుంటున్న చాలామందికి ఇదో హెచ్చరికగా పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.