ప్రవీణ్‌ప్రకాశ్‌పై నివేదిక ఇవ్వండి.
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తరచూ
ఎమ్మెల్సీ రఘువర్మ ఫిర్యాదుపై కేంద్రం ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారశైలి మరోసారి రచ్చకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తరచూ జిల్లాల పర్యటనలు చేస్తూ, అధికారులు, ఉపాధ్యాయులను ఆయన హడలెత్తిస్తున్నారు. రాత్రి సమయాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి నోట్ పుస్తకాలు పరిశీలిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల కుటుంబాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన సెన్సేషన్ కోసం తాపత్రయపడుతున్నారని, ఆయన వ్యవహారశైలి అభ్యంతరకరంగా ఉందంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి గతేడాది ఆగస్టులో ఫిర్యాదు పంపారు. దీనిపై స్పందించిన కేంద్రం.. ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సవివర నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖను జీఏడీ ఈ నెల 14వ తేదీన ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖకు ఆయనే బాస్ కావడంతో ఇప్పుడు ఎలాంటి నివేదిక పంపుతారనేది ఆసక్తికరంగా మారింది.
ఆయనది రహస్య అజెండా…
సీనియరు ఐఏఎస్ అధికారిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ తరచూ సెన్సేషన్ కోసం తాపత్రయపడుతున్నారని, అందుకోసం మిగిలిన అధికారులతో పోలిస్తే అసాధారణంగా వ్యవహరిస్తున్నారని తన ఫిర్యాదులో రఘువర్మ తెలిపారు. ‘‘దీనివెనుక రహస్య అజెండా ఉందనేది బహిరంగ రహస్యం. ఆయన తనపాఠశాలల పర్యటనల్లో విద్యార్థుల ముందే టీచర్లను దూషిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటన పేరుతో నేరుగా విద్యార్థుల ఇళ్లకే వెళ్తున్నారు. రాత్రి 10 గంటల సమయంలోనూ ఇళ్లకు, కేజీబీవీలకు వెళ్లి నోట్ పుస్తకాల పరిశీలన అంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా అక్కడే అధికారులు, టీచర్లను తిట్టడం, సస్పెండ్ చేయాలనే ఆదేశాలు ఇవ్వడం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో పాఠ్యపుస్తకాలు సరఫరా చేయకపోయినా దానికీ టీచర్లనే బాధ్యులను చేస్తున్నారు. రాష్ట్రంలోని 9వేల పాఠశాలల్లో ఒక్కో టీచరే ఉన్నారు. కానీ వారిపై బోధనేతర పనులు చాలా ఉన్నాయి. పిల్లల హాజరు, టాయిలెట్ల ఫొటోలు తీయడం, మధ్యాహ్న భోజనం పనులు, నాడు- నేడు పనులు లాంటి బాధ్యతలు టీచర్లపై పెట్టారు. కానీ ఇవేం పట్టించుకోకుండా రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఇంటికి వెళ్లి విద్యార్థుల నోట్ పుస్తకాలు అడుగుతున్నారు. ప్రతి ఉద్యోగికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది లేకుండా ఉపాధ్యాయులను ప్రవీణ్ ప్రకాశ్ వేధిస్తున్నారు’’ అని తన ఫిర్యాదులో రఘువర్మ తెలిపారు.