Gmail: జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం.. గూగుల్‌ క్లారిటీ ఇదే…

Gmail

www.mannamweb.com


Gmail | ఇంటర్నెట్‌ డెస్క్: గూగుల్‌కు చెందిన ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ (Gmail) సేవలను నిలిపివేస్తారంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయన్నది ఆ పోస్టుల సారాంశం. దీనిపై గూగుల్‌ (google) స్పష్టతనిచ్చింది. తమ సేవలు యతాథతంగా కొనసాగుతాయని వెల్లడించింది.

ఏళ్లుగా లక్షలాది మందికి ఇ-మెయిల్‌ సేవలు అందిస్తున్న జీమెయిల్‌ త్వరలో మూతపడబోతోందని, 2024 ఆగస్టు 1 నుంచి ఈ సర్వీసులు నిలిచిపోనున్నాయంటూ ఓ స్క్రీన్‌షాట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. ఇకపై మెయిల్స్‌ పంపించడం గానీ, పొందడం గానీ చేయలేరంటూ జీమెయిలే స్వయంగా ఓ యూజర్‌కు తెలియజేసినట్లు ఆ స్క్రీన్‌షాట్‌లో ఉంది. అది కాస్తా ఎక్స్‌, టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది. దీంతో చాలామంది జీమెయిల్‌ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ప్రచారంపై గూగుల్‌ స్పందించింది. జీమెయిల్‌ అధికారిక ఎక్స్‌ ఖాతా నుంచే ఈ సేవలు కొనసాగుతాయంటూ ఓ పోస్ట్‌ పెట్టింది. తద్వారా సోషల్‌మీడియాలో జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి చెక్‌ పెట్టింది. ఈ ప్రచారంపై టెక్‌ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తంచేశారు. ఈ తరహా ప్రకటనలను ఆదిలోనే అంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరి నుంచి జీమెయిల్‌ తన హెచ్‌టీఎంఎల్‌ వెర్షన్‌ సర్వీసులను మాత్రమే నిలిపివేసింది. నెట్‌వర్క్‌ సరిగా లేని సమయంలోనూ ఇ-మెయిల్స్‌ పొందడం ఈ సర్వీసుల ఉద్దేశం. రెగ్యులర్‌ ఇ-మెయిల్‌ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.