తిరుమల వెళ్తున్నారా? – కొండపై గదులు దొరక్కపోతే ఏం చేయాలి? – ఇలా చేస్తే పక్కా! – Rental Rooms In Tirumala

www.mannamweb.com


Rental Rooms in Tirumala : తిరుమల కొండపై వెలసిన వేంకటేశ్వర స్వామి దర్శనానికి సాధారణ రోజుల్లోనే భక్తులు పోటెత్తుతారు. అలాంటిది ఇక సెలవు దినాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. భక్తజనంతో తిరుమల గిరులు కిక్కిరిసిపోతాయి. ఇప్పుడు వేసవి సెలవులు రావడంతో.. కొండపై ఇదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లాకర్లు మొదలు.. అద్దె గదుల వరకు అన్నీ నిండిపోతాయి. ఫలితంగా.. అత్యవసరమైన వారు రూములు లభించక అవస్థలు పడుతుంటారు.

అందుకే.. చాలా మంది ముందుగానే ఆన్​లైన్​లో దర్శన టికెట్లు, అద్దె గదులు బుక్​ చేసుకొని వెళ్తుంటారు. నెల రోజులు ముందుగానే టీటీడీ రూమ్​ల బుకింగ్​ ఓపెన్ చేస్తుంది. అయితే.. బుకింగ్ తెరిచిన కాసేపటికే గదులు మొత్తం నిండిపోతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా కొన్ని గదులు బ్లాక్​ చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నిర్వహించిన “డయల్ యువర్ ఈవో” కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గదుల బుకింగ్​ సమస్యను కూడా భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు. స్పందించిన ఈవో గదులు అత్యవసరమైన వారు ఎలా బుక్​ చేసుకోవచ్చో వివరించారు.

టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలో ఈ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ధర్మారెడ్డి సమాధానాలు చెప్పారు. ఆన్‌లైన్‌ లో విడుద‌ల చేస్తున్న టికెట్లు వెంట‌నే అయిపోతున్నాయని.. ఎంత ప్రయత్నించినా బఫరింగ్ అవుతోందే తప్ప టికెట్లు బుక్ కావడం లేదని.. ఇదంతా చూస్తుంటే పారదర్శకత లోపించిందేమో అనే సందేహం కలుగుతోందని ఓ భక్తుడు ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఈవో.. శ్రీవారి సేవ ఆన్‌లైన్‌ అప్లికేషన్ చాలా పారదర్శకంగా ఉందన్నారు. ఎటువంటి అనుమానాలకూ చోటు లేదని చెప్పారు.

తిరుమల కొండపై 7,500 గదులు మాత్రమే ఉన్నాయని ఈవో చెప్పారు. ఇందులో 50 శాతం గదులు ఆన్​లైన్​ బుకింగ్ కోసం అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. ఎంతో మంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నిస్తుంటారు కాబట్టి.. వెంటనే అయిపోయే అవకాశం ఉందన్నారు. ఆన్​లైన్​లో రూమ్స్​ దొరకని భక్తులు.. తిరుమలలో సీఆర్వోలో నమోదు చేసుకోవడం ద్వారా రూమ్స్​ పొందే అవకాశం ఉందని ఈవో చెప్పారు