బంగారం, వెండి ధరల పతనం.. మరింత పడిపోనున్నాయా?

బంగారం, వెండి మార్కెట్లలో శుక్రవారం పెను ప్రకంపనలు రేగాయి. ఎంసీఎక్స్ (MCX)లో పసిడి ధర భారీగా పడిపోయింది. వెండి ధర కూడా కుప్పకూలింది. ఈ భారీ పతనం నేపథ్యంలో మదుపర్లు ఏం చేయాలో తెలియక తలమునకలవుతున్నారు.

బులియన్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు భారీ పతనం నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి బంగారం, వెండి ధరలు కుప్పకూలడంతో మదుపర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పుడు 4 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, మధ్యాహ్నానికి భారీగా పడిపోయాయి.


బంగారం ధరల పతనం ఇలా..

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 9 శాతం మేర క్షీణించాయి. అంటే 10 గ్రాముల బంగారంపై సుమారు రూ. 15,000 తగ్గుతూ రూ. 1,54,157 వద్దకు చేరింది. గతంలో నమోదైన ఆల్-టైమ్ గరిష్ట ధరలతో పోలిస్తే, పసిడి ఇప్పుడు ఏకంగా రూ. 26,600 (సుమారు 14.7 శాతం) మేర పతనం కావడం గమనార్హం.

వెండి పరిస్థితి మరీ దారుణం

వెండి ధరల పతనం పసిడి కంటే తీవ్రంగా ఉంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర ఏకంగా 15 శాతం కుప్పకూలింది. ఒక్కరోజే కిలో వెండిపై సుమారు రూ. 60,000 మేర తగ్గడంతో ధర రూ. 3,39,910 వద్దకు చేరింది. రికార్డు గరిష్ట స్థాయిల నుండి వెండి ధర ఇప్పటి వరకు రూ. 80,000 (23.5 శాతం) మేర తగ్గడం విశేషం.

అంతర్జాతీయ మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి ఈ భారీ పతనం కేవలం దేశీయ మార్కెట్లకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగానూ అమ్మకాల ఒత్తిడి (Selling Pressure) స్పష్టంగా కనిపించింది. అమెరికా స్పాట్ మార్కెట్‌లో పసిడి ధర 7 శాతం మేర తగ్గి 5,000 డాలర్ల దిగువకు చేరింది. అలాగే వెండి ధర కూడా 100 డాలర్ల మార్కు కంటే కిందకు పడిపోయింది.

ఇది కొనే సమయమా?

సాధారణంగా ధరలు భారీగా తగ్గినప్పుడు కొనుగోలుదారులు మార్కెట్లోకి రావడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, ఈ స్థాయి పతనం ఒక రకమైన అనిశ్చితిని సృష్టించింది. మార్కెట్ మరిన్ని కనిష్టాలను తాకుతుందా లేక ఇక్కడి నుంచి పుంజుకుంటుందా అనే డైలమాలో ఇన్వెస్టర్లు ఉన్నారు.

కొత్తగా కొనాలనుకునే వారు: ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందేమోనని కొద్దిరోజులు వేచి చూడటం లేదా విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్వెస్టర్లు: లాంగ్ టర్మ్ కోసం చూసే వారు ఈ తగ్గుదలను ఒక అవకాశంగా భావించవచ్చు. కానీ స్వల్పకాలిక ట్రేడర్లు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.