Minister Nara Lokesh: త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్‌

మంగళగిరిలో మినీ దుబాయ్‌!


ముంబైకి దీటుగా ఏర్పాటుకు సన్నాహాలు.. 60 ఎకరాల్లో జెమ్స్‌-జ్యూయలరీ పార్కు

12 వేలమంది స్వర్ణకారులకు ఉపాధి.. లోకేశ్‌ సొంత ఖర్చులతో గోల్డ్‌స్మిత్‌ ఫౌండేషన్‌

స్వర్ణకారులకు డిజైన్లపై శిక్షణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆభరణాల తయారీ

రాష్ట్ర రాజధాని పరిధిలోని మంగళగిరి రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే ఎయిమ్స్‌, ప్రముఖ విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు ఇక్కడ కొలువుదీరాయి. త్వరలో దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దేశంలో నవీముంబైతో పాటు కోల్‌కతా, కోయంబత్తూరు వంటి నగరాల్లో ఇలాంటి జ్యూయలరీ పార్కులున్నాయి. వీటిలో ముంబైలోని జ్యూయలరీ పార్కు వ్యాపార రీత్యా అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా వెలుగొందుతోంది. రూ.50 వేలకోట్ల పెట్టుబడులతో దాదాపు లక్షమందికి ఉపాధి కల్పిస్తోంది. ముంబైలోని జ్యూయలరీ పార్కుకు దీటుగా మంగళగిరిలో అతిపెద్ద జెమ్స్‌ అండ్‌ జ్యూయలరీ పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్‌ పట్టుదలగా ఉన్నారు. లోకేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో గోల్డ్‌హబ్‌ నిర్మాణానికి వేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో స్వర్ణకార వృత్తిదారులు గణనీయంగా ఉండడంతో ఆయన ఎన్నికల సమయంలో ఈ హమీ ఇచ్చారు. స్వర్ణకారులకు చేతినిండా పని ఉండేలా చేయడంతో పాటు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తగిన చర్యలు చేపడతామని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే ఈ దిశగా కార్యాచరణ మొదలు పెట్టారు.

60 ఎకరాల ఎంపిక

మంగళగిరిలోని తెనాలి రోడ్డు వెంబడి అక్షయపాత్ర భవన సముదాయానికి దక్షిణంగా ఆత్మకూరు ప్రాంత పరిధిలోకి వచ్చే భూముల్లో గోల్డ్‌హబ్‌ ఏర్పాటు చేయబోతున్నారు. ఆత్మకూరు సర్వే నంబర్లు 133, 134, 135, 136లలో ఉన్న ప్రభుత్వ ఖాళీ, ఎసైన్డ్‌ భూముల్లో జిల్లా అధికారులు సుమారు 60 ఎకరాలను ఎంపిక చేశారు. రెండు మూడు మాసాలలో జ్యూయలరీ పార్కు నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని మంత్రి లోకేశ్‌ ఇప్పటికే ఆదేశించారు. ఇక్కడ ఎక్కువగా ఉన్న చేనేత కార్మికుల కోసం మెగా హ్యాండ్లూమ్‌ పార్కు, స్వర్ణకార వృత్తిదారుల కోసం జ్యూయలరీ పార్కును ఏకకాలంలో నిర్మించే విధంగా లోకేశ్‌ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం 12 వేలమంది స్వర్ణకార వృత్తిదారులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జ్యూయలరీ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. తరువాత దీనిని అంచెలంచెలుగా అతిపెద్ద గోల్డ్‌హబ్‌గా అభివృద్ధి చేస్తారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో ఓ మినీ దుబాయ్‌ ఆవిర్భవించనుంది!

ప్రత్యేకతలు ఏంటంటే…

మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న గోల్డ్‌హబ్‌లో రత్నాలు, బంగారంతో కూడిన ఆభరణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత నైపుణ్యంగా తయారు చేస్తారు. ఈ ఆభరణాలకు తరుగు కూడా చాలా తక్కువస్థాయిలోనే ఉంటుంది. సాధారణంగా వృత్తిదారులు, వ్యాపార సంస్థలు తరుగును పదిశాతంగా లెక్కిస్తుంటాయి. కానీ ఈ పార్కులో కొనుగోలుదారులకు తరుగు దాదాపు మూడు శాతంగా మాత్రమే ఉండే అవకాశముంది. ఇదో పెద్ద వెసులుబాటు కానుంది. ఇక్కడ ముక్కుపుడక నుంచి వడ్రాణం వరకు అన్నిరకాల మోడళ్లలో ఆభరణాలను చాలా తొందరగా తయారు చేయనున్నారు. ఇందుకు అవసరమైన అత్యాధునిక మిషనరీ అంతా పార్కులో అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన టెస్టింగ్‌ ల్యాబ్‌లతో సహా అవసరమైన సౌకర్యాలన్నీ ఉంటాయి. ఈ జ్యూయలరీ పార్కు నుంచి ఎగుమతులు కూడా అంతర్జాతీయస్థాయిలో ఉంటాయి. రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద పెద్ద జ్యూయలరీ షోరూమ్‌ల నుంచి భారీగా ఆర్డర్లు తీసుకుని సరికొత్త మోడళ్లలో అన్నిరకాల బంగారు, రత్నాలతో కూడిన ఆభరణాలను తయారు చేసి ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా వచ్చే అన్నిరకాల మోడళ్లను ఇక్కడి నిపుణులైన డిజైనర్లు రూపొందిస్తారు.

ఏవేవి ఉంటాయంటే…

ఈ జ్యూయలరీ పార్కులో పరిపాలనా భవనం, హాల్‌మార్కింగ్‌ సెంటర్‌, గోల్డ్‌ వాల్ట్‌, సర్టిఫికేషన్‌ సెంటర్‌, లేజర్‌ ఎన్‌గ్రేవింగ్‌ సెంటర్‌, కో-ఆపరేటివ్‌ డిస్‌ప్లే సెంటర్‌, కేడ్‌తో కూడిన డిజైన్‌ సెంటర్‌, బిజినెస్‌ సెంటర్‌, ఇంపోర్ట్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ నోడల్‌ ఏజెన్సీ, క్లియరింగ్‌ ఏజెంట్‌ ఆఫీసెస్‌, ఫైర్‌ స్టేషన్‌, సెక్యూరిటీ భవనం, డిస్పెన్సరీ, నీటి సరఫరా కేంద్రంతో పాటు ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, ఎస్టీపీ, ఈటీపీ, సర్వీస్‌ బ్లాకు, ఇంటర్నల్‌ ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌, పైపులతో కూడిన గ్యాస్‌ బ్యాంకు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. అలాగే వివిధ మెగా షోరూమ్‌లకు చెందిన షాపులను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.

స్వర్ణకారులకు శిక్షణ

ఈ జ్యూయలరీ పార్కు కోసం స్వర్ణకారులను ముందుగానే సిద్ధం చేయనున్నారు. మంత్రి లోకేశ్‌ సొంత ఖర్చులతో ఎల్‌ఎన్‌ గోల్డ్‌స్మిత్‌ ఫౌండేషన్‌ పేరిట ఓ సంస్థను స్థాపించి మంగళగిరిలోని స్వర్ణకారులందరికీ ఆధునిక డిజైన్ల తయారీపై శిక్షణ ఇప్పించబోతున్నారు. ఇందుకోసం నగరంలోని గౌతమబుద్ధ రోడ్డులో ఐదు అంతస్తుల భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ ఫౌండేషన్‌ కోసం గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, పడవల మహేశ్‌, మండవ హారికలతో డైరెక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 77 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 670 మంది స్వర్ణకారులకు ఉచితంగా శిక్షణ ఇస్తారు. పూర్తి చేసుకున్న వృత్తిదారులకు పని కల్పించే బాధ్యతను కూడా లోకేశ్‌ వ్యక్తిగతంగా తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు నగల షోరూమ్‌ల నుంచి ఆర్డర్లను గోల్డ్‌స్మిత్‌ ఫౌండేషన్‌కు ఇప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు.