బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. వీటితో ఫిజికల్ గోల్డ్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతి ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబోయే సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) ట్రాంచ్‌లను, వాటి జారీ, రిడమ్షన్ తేదీను ప్రకటిస్తుంది. ఈ గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2017-18 SGB సిరీస్ X ప్రీమెచ్యూర్ రిడెమ్షన్ ప్రైస్ ప్రకటించింది RBI.
2017-18 X సిరీస్ గోల్డ్ బాండ్లను 2017 డిసెంబర్ 4న ఇష్యూ చేసింది ఆర్బీఐ. అయితే గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్ళు అయినా కూడా ఇష్యూ చేసిన డేట్ నుంచి సరిగ్గా ఐదేళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే 2017-18 SGB సిరీస్ X ప్రీమెచ్యూర్ రిడెమ్షన్ ప్రైస్ ప్రకటించడం జరిగింది.
ఈ సిరీస్ గోల్డ్ బండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ. 2961 కాగా.. ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడెమ్షన్ ప్రైస్ గ్రాముకు రూ. 7,646గా ఖరారు చేసింది ఆర్బీఐ. ఈ లెక్కన ఈ ఏడేళ్ల కాలంలో గ్రాముపై రూ. 4685 లాభం వచ్చిందని అర్థం. అంటే ఇది ఇష్యూ ధరతో పోలిస్తే ఏకంగా 158.22 శాతం ఎక్కువ. దీనికి నిర్దేశించిన వడ్డీ కూడా అదనంగా వస్తుంది.
SGBలపై వడ్డీ:
బంగారం ధరలపై క్యాపిటల్ గెయిన్స్‌తోపాటు SGB పెట్టుబడిదారులు 2.50% ఫిక్స్‌డ్ ఇంట్రెస్ట్ రేటు పొందుతారు. ఇది ప్రతి ఆరు నెలలకు ఇన్వెస్టర్లకు చెల్లిస్తారు. మెచ్యూరిటీ తేదీలో ప్రిన్సిపల్‌తో పాటు చివరి వడ్డీ పేమెంట్ క్రెడిట్ అవుతుంది.
రిడమ్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
బాండ్ మెచ్యూరిటీకి ఒక నెల ముందు పెట్టుబడిదారులు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అందుకుంటారు. మెచ్యూరిటీ తేదీలో, చివరి వడ్డీ చెల్లింపు, అసలు సహా ఆదాయం నేరుగా SGBకి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. అకౌంట్ నంబర్ లేదా ఇమెయిల్ ID వంటి బ్యాంక్ అకౌంట్ వివరాల్లో మార్పులు ఉంటే, పెట్టుబడిదారులు తమ బ్యాంక్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SHCIL) లేదా పోస్ట్ ఆఫీస్‌కు ముందుగా తెలియజేయాలి. SGB అకౌంట్‌లకు సంబంధించిన ఏవైనా వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేయాల్సి ఉన్నా సంబంధిత సంస్థలను సంప్రదించాలి.