Gold Kulfi: బంగారం ధరించడమే కాదు అక్కడ తింటున్నారు – 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ ధర ఎంతో తెలుసా?

www.mannamweb.com


Gold Kulfi Of Indore: బంగారాన్ని నగలుగా చేయించుకుని ధరించడం ఇప్పటి వరకు చూశాం. కానీ, ఇప్పుడు బంగారంతో చక్కటి కుల్ఫీలు చేయించుకుని తింటున్నారు. బంగారంతో కుల్ఫీలు చేయడం ఏంటి? వాటిని తినడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ, మీరు విన్నది నూటికి నూరుపాళ్లు నిజం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఏకంగా 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ అమ్ముతున్నారు. కస్టమర్లు ఎగబడి మరీ కొంటున్నారు. అరుదైన కుల్ఫీని తిని ఎంజాయ్ చేస్తున్నారు.

ఫుడ్ వెరైటీస్ కు పెట్టింది పేరు!
ఇండోర్ అనగానే చక్కటి ఫుడ్ వెరైటీస్ కు పెట్టింది పేరు. అక్కడ ఎన్నో రకాలపైనా వంటకాలు లభిస్తాయి. అన్నింటితో పోల్చితే అక్కడి కుల్ఫీ టేస్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గత వేసవి వరకు ఎర్రటి గుడ్డలు చుట్టిన పెద్ద పెద్ద కుండలతో కూడిన కుల్ఫీ బండ్లు వీధుల్లో తిరుగుతూ కనిపించేవి. నేచురల్ గా కుండల కూలింగ్ లో ఉండే కుల్ఫీలను జనాలు ఎంతో ఇష్టంగా తినేవాళ్లు. కానీ, ఈ ఎండకాలంలో కుల్ఫీలు కొత్త హంగులు అద్దుకున్నాయి. ఏకంగా బంగారంతో కూడిన కుల్ఫీలను అమ్ముతున్నారు దుకాణదారులు. వీటిని తినేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.

24 క్యారెట్ల బంగారు కుల్ఫీ
ఇండోర్ సిటీలోని ఫుడ్ షాపుల్లో గోల్డ్ కుల్ఫీ ప్రత్యేకంగా నిలుస్తుంది. 24 క్యారెట్ల బంగారు వర్క్ తో అలంకరించబడిన కుల్ఫీలు బాగా అమ్ముడుపోతున్నాయి. స్పెషల్ కుల్ఫీకి బంగారు పూతతో కూడిన కవర్ ను చుట్టి అందిస్తున్నారు. ప్రకాష్ కుల్ఫీ & ఫలూదా షాప్ యజమాని బంటీ యాదవ్, షాహీ కుల్ఫీతో సహా ఏకంగా 18 రకాల కుల్ఫీలను కస్టమర్లకు అందిస్తున్నారు. బంటి తాత ఈశ్వరీలాల్ 1965లో ఈ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో కేసర్ కుల్ఫీని మాత్రమే అందించేవారు. ఆ దుకాణం తన తండ్రి చేతికి వచ్చాక జీడిపప్పు, సీతాఫలం, మామిడి రుచులను యాడ్ చేశారు. ఇప్పుడు బంటి, తన సోదరుడు శివ కలిసి జీడిపప్పు-గుల్కంద్, పాన్, స్ట్రాబెర్రీ, జామూన్, మలై, చాక్లెట్, ఫిగ్-డ్రై ఫ్రూట్స్ వంటి రుచులను అందిస్తున్నారు.

ఇండోర్ గోల్డ్ కుల్ఫీ ప్రత్యేకత ఏంటంటే?
నిజానికి బంగారు కుల్ఫీ అందించాలనే ఆలోచన.. బంటి సోదరులకు బంగారం మీద ఉన్న ఇష్టమే కారణం అయ్యింది. తమ కస్టమర్లకు ప్రత్యేకమైన కుల్ఫీ అందించాలని భావించారు. అందులో భాగంగానే కుల్ఫీకి బంగారు కవర్ చుట్టి అందిస్తున్నారు. కుల్ఫీ తయారీ కోసం ఫతేహాబాద్ నుంచి పాలను తీసుకొస్తారు. వాటిని సన్నని సెగ మీద వేడి చేస్తారు. సాంప్రదాయకంగా, కుల్ఫీని కుండలో తయారు చేస్తారు. వాటిని కుల్ఫీ పీసెస్ గా చేసి ఫ్రిజ్ లో పెడతారు. కస్టమర్లకు ఇష్టమైన కుల్ఫీని అందిస్తారు. బంగారు కుల్ఫీ కావాలి అనుకునే వారికి కుల్ఫీ చుట్టూ బంగారం పేపర్ చుట్టి అందిస్తున్నారు. ఈ పేపర్ కుల్ఫీని తింటున్నప్పుడు నెమ్మదిగా కరిగి నోట్లోకి వెళ్తుంది. ప్రస్తుతం గోల్డ్ కుల్ఫీ బాగా ఫేమస్ అయ్యింది. బంగారు కుల్ఫీ ధరను రూ. 2,999గా నిర్ణయించారు. బంటీ దుకాణానికి కస్టమర్ల తాకిడి కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఈ గోల్డ్ కుల్ఫీకి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవున్నాయి.