బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర గడచిన రెండు రోజులుగా మాత్రం పెరుగుతూనే ఉంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఒక కారణంగా చెప్పవచ్చు.
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా జరుగుతున్న యుద్ధ వాతావరణమే ప్రధానంగా కనిపిస్తోంది. రష్యా పైన మిస్సైల్స్ దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడంతో ఒకసారిగా యుద్ధ వాతావరణం పెరిగింది. దీంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా నష్టపోవడం ప్రారంభించాయి. ఈ కల్లోల సమయంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కాపాడుకునేందుకు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం ధర పెరగడం ప్రారంభించింది. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందని వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమెరికా దివాలా అంచుల్లో ఉందని ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రకటించిన నేపథ్యంలో అటు స్టాక్ మార్కెట్లు సైతం నెగిటివ్గా స్పందిస్తున్నాయి ఫలితంగా సురక్షితమైన పెట్టుబడి సాధనం అయిన బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా మారింది.
మళ్లీ రూ. 80 వేల దాటిన బంగారం ధర..
ప్రస్తుతం బంగారం ధర చూసినట్లయితే హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80830 రూపాయలు పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73800 రూపాయలు పలుకుతుంది. ఒక దశలో బంగారం ధర 75 వేల రూపాయల వరకు తగ్గుముఖం పడుతుందని అంతా అంచనా వేశారు. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం ధర పెరగడం ప్రారంభించి మరోసారి 80 వేల రూపాయలకు చేరింది. దీంతో మరోసారి ఆల్ టైం రికార్డ్స్ ఉందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు దేశీయంగా చూసినట్లయితే బంగారం ప్రస్తుతం సీజన్ పూర్తి అవడంతో పెద్దగా ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపడం లేదు.
జనవరిలో బంగారం తగ్గే అవకాశం..
వివాహాల సీజన్ తో పాటు ఫెస్టివల్ సీజన్ కూడా దాదాపు ముగిసింది. ఉత్తర భారత దేశంలో చలిగాలుల తీవ్రత కూడా భారీగా ఉన్న నేపథ్యంలో షాపింగ్ చేసే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీనికి తోడు విపరీతమైన ధరలు ఉన్న నేపథ్యంలో పసిడి ఆభరణాల కొనుగోలుకు జనం వెనకడుగు వేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగారం ధరలు జనవరి నెల నుంచి తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు విప్లవాత్మకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తద్వారా స్టాక్ మార్కెట్లు పుంజుకొని ఫిబ్రవరి నెల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.