Gold Rate: మళ్లీ కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. మరో ఏడాదిలో రూ. 80వేలకు ?

www.mannamweb.com


రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు 65 వేల మార్క్ క్రాస్ చేసింది. 2018లో 30వేలున్న పది గ్రాముల పసిడి ధర..ఆరేళ్లు గడిచేసరికి రెండింతలైంది. మరో ఏడాదిలోగా 80వేలకు చేరవచ్చన్నది ఒక అంచనా. ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మంగళవారం ఒక్కరోజే 800 రూపాయలు పెరిగింది. గత వారం రోజుల్లోనే పది గ్రాముల బంగారం ధర 2,300 పెరిగింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పసిడి ధరల దూకుడు ఏ రేంజ్‌లో ఉందో. స్వతహాగా భారతీయ మహిళలు ఆభరణ ప్రియులు. పైగా శుభ సందర్భం ఏదైనా తాహతుకు తగ్గట్టు ఎంతోకొంత బంగారం కొనుగోళ్లు తప్పనిసరి. అందుకే కొనుగోళ్ల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు.

పుత్తడి ఇంత ప్రియం ఎందుకవుతోంది..? అంటే.. అమెరికాలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు.. ఆర్థిక అనిశ్చితి కొనసాగడం.. ఇలా అనేక కారణాలు చెబుతారు ఎక్స్‌పర్ట్స్. దీనికి తోడు భౌగోళిక, రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరల్ని శాసిస్తాయి. సురక్షిత పెట్టుబడి మార్గాల్లో బంగారం కూడా ఒకటిగా మారడంతో పసిడి వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి. క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపైనా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరగడానికి మరో కారణం.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. అటు.. బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది ఒక సెంటిమెంట్‌గా మారిందని, దాన్ని ఎవరూ ఆపలేరని ధీమాతో ఉన్నారు జ్యుయెలరీ వ్యాపారులు. ప్రస్తుతానికి ఏప్రిల్ నెలనుంచి కొన్నిరోజులు సుముహూర్తాలు లేవు. ఇప్పుడు అమ్మకాలు మందగించినా.. ఆ తర్వాత పుంజుకుంటాయనేది ఒక అంచనా. సో.. పుత్తడి ధరకు కళ్లెం పడే ఛాన్స్ లేనట్టే మరి.