తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య శ్రీ పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్య శ్రీ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నాతాధికారులను ఆదేశించారు. రేషన్ కార్డుతో లింక్ చేయకుండా సేవలు అందించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ మెయిన్ టైన్ చేయాలని సూచించారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూరల్ ఏరియాలో వైద్యులకు మెరుగైన పారితోషికం అందజేయాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో చేపట్టిన సదస్సులో ఈ మేరకు ఆదేశాలు చేశారు రేవంత్ రెడ్డి.
ప్రజాహితమే ధ్యేయంగా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ.. ఇది ప్రజా ప్రభుత్వం అనే మార్కు కనిపించేలా పాలన సాగాలని కలెక్టర్లను ఆదేశించారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందని చెప్పారు. ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ప్రజాపాలన సహా ఇతర రూపాల్లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్దిదారులను గుర్తించి, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ అందరికీ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్ఎంపీ, పీఎంపీల ఇబ్బందులు తొలగిపోయేలా చర్యలు తీసుకోెవాలని తెలిపారు. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు.
ఆసుపత్రుల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన, ధరణి సమస్యలు, ఖరీఫ్ వ్యవసాయం, ప్రజారోగ్యం – సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళాశక్తి, విద్య, శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై సీఎం అధికారులతో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి.. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీ అయితే.. విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుల్లా స్పందించే తీరుగా కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా పనితనం ఉండాలని, ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లాంటి అధికారులు చూపిన ఆదర్శాలను పాటించాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.