టెన్త్ విద్యార్థళులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎదుర్కొనే ప్రధాన ఇబ్బందులలో ఒకటైన పరీక్షా కేంద్రాన్ని గుర్తించే సమస్యకు చెక్ పెట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది.
ఈ మేరకు రాబోయే టెన్త్ పరీక్షల్లో హాల్ టికెట్‌పై సెంటర్ లోకేషన్‌ను క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వాలని భావిస్తోంది. ఈ నూతన విధానం అమలులోకి వస్తే, విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు తమ స్మార్ట్‌ఫోన్‌తో హాల్ టికెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే, ఆ పరీక్షా కేంద్రం ఖచ్చితమైన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ నేరుగా తెరుచుకుంటుంది. దీని ద్వారా సెంటర్‌ను సులభంగా, తక్కువ సమయంలో గుర్తించవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుండి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం ఇప్పటికే దాదాపు 5.27 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వీరందరి సౌలభ్యం కోసం ఈ క్యూఆర్ కోడ్ ప్రయోగాన్ని అమలు చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని పట్టణ ప్రాంతాలలో, జిల్లా కేంద్రాలలో పరీక్షా కేంద్రాలను వెతకడం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతోంది.
కొన్ని సందర్భాల్లో పాఠశాల పేరు ఒకచోట, దాని లొకేషన్ మరోచోట ఉండటం లేదా ఒకే పేరుతో వేర్వేరు స్కూళ్లు ఉండటం వల్ల చిక్కులు తలెత్తుతున్నాయి. అడ్రస్ సరిగా తెలియక పరీక్ష రోజు ఆందోళన చెందకుండా ఉండేందుకు ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష కేంద్రాల గుర్తింపులో తలెత్తే ఒత్తిడిని తగ్గించి, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షకు హాజరయ్యేందుకు ఈ క్యూఆర్ టెక్నాలజీ ఒక ముఖ్యమైన చర్యగా నిలుస్తుంది.



































