నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద పూనకాలు మొదలవుతాయి. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన ‘అఖండ’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘అఖండ 2: తాండవం’ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై రికార్డుల వేట కొనసాగించింది. వెండితెరపై శివతాండవం చేసిన ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ సీక్వెల్ కథ విషయానికి వస్తే, మొదటి భాగం ముగిసిన సుమారు 18 ఏళ్ల తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో బోయపాటి దీనిని మలిచారు. అఖండ సోదరుడి కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీగా పనిచేస్తుంటుంది. భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో ఒక ప్రమాదకరమైన వైరస్ ఎటాక్ జరగడంతో కథలో అసలైన మలుపు మొదలవుతుంది.
ఈ వైరస్‌ను అడ్డుకునే వ్యాక్సిన్‌ను కనిపెట్టిన జనని, తన మెంటార్ (సంయుక్త మీనన్) సహాయంతో దానిని సిద్ధం చేస్తుంది. కానీ, దేశంపై దురుద్దేశంతో ఉన్న ఠాగూర్ (కబీర్ దుల్హన్ సింగ్) ఆ యాంటీడోడ్‌ను దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
తన మేనకోడలు ప్రమాదంలో ఉందని తెలుసుకున్న అఘోరా అఖండ శిఖందర్ రుద్ర (బాలకృష్ణ), హిమాలయాల్లోని తన శివారాధనను వీడి జననిని రక్షించేందుకు తిరిగి వస్తాడు. కుంభమేళా గంగలో వైరస్ కలిపిన దుర్మార్గుల వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? ఈ కుట్రలో నేత్ర (ఆది పినిశెట్టి) పాత్ర ఏంటి? అనే ఉత్కంఠభరితమైన అంశాలను బోయపాటి తనదైన శైలిలో వెండితెరపై ఆవిష్కరించారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను చూడాలనుకునే వారు ఈ సంక్రాంతికి నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ తాండవాన్ని వీక్షించవచ్చు.



































