ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త.. అస్సలు మిస్ చేసుకోవద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తనవంతుగా కృషి చేస్తూనే ఉంది. ముఖ్యంగా మహిళా సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్న ఏపీ సర్కార్ తాజాగా మహిళలకు మరో శుభవార్త చెప్పింది.


మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, భద్రత కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.

ఏపీ ప్రభుత్వం మహిళల కోసం కొత్త కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులలో ఉన్న పొదుపుసంఘాల మహిళలకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు సఖి సురక్ష హెల్త్ కేర్ స్క్రీనింగ్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలలో పొదుపు మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కూటమిప్రభుత్వం చేపట్టిన చర్యలలో భాగంగా ఈ హెల్త్ కేర్ స్క్రీనింగ్ చేస్తోంది.

ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడానికి రెడీ అయిన ఏపీ సర్కార్

ఇందులో భాగంగా 35 సంవత్సరాలు పైబడిన పట్టణ ప్రాంత పొదుపు మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ అభియాన్ పరివార్ కార్యక్రమం ద్వారా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సైతం మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడానికి రెడీ అయింది.

పట్టణ ప్రాంతాలలో డ్వాక్రా మహిళలకు పరీక్షలు

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పట్టణ ప్రాంతాలలో మహిళలకు అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్టు తేలింది. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే మహిళలు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది .ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలలోని మహిళలకు ముఖ్యంగా పరీక్షలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది.

పరీక్షలు చేసి ఉచిత చికిత్స

మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, రక్తహీనత, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్, మానసిక సమస్యలు, పోషకాహార లోపంతో పాటు 16 రకాల పరీక్షలు నిర్వహించాలని, వ్యాధులను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమం కింద మహిళా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు కూడా నిర్వహించనున్నారు. మొత్తంగా సఖి సురక్ష హెల్త్ కేర్ స్క్రీనింగ్ ద్వారా మహిళల ఆరోగ్యం పైన తమ నిబద్ధతను చూపే ప్రయత్నం చేస్తోంది ఏపీ సర్కార్.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.