ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేంద్ర పథకాలను అనుసంధానం చేస్తూ ఉపాధిని కల్పిస్తోంది. తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలో దళితులకు ఉపాధి కల్పించేందుకు సిద్ధమైంది. కేంద్రం తీసుకొచ్చిన పీఎం అజయ్ పథకాన్ని.. రాష్ట్ర పథకమైన ఉన్నతితో అనుసంధానం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం దళిత వర్గాలకు ప్యాసింజర్ ఆటోలు, వ్యవసాయ పరికరాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,074మందికి ప్యాసింజర్ ఆటోలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆటోల సేకరణ కోసం టెండర్ కమిటీలను నియమించింది ప్రభుత్వం. ఈ పథకానికి సంబంధించి మొత్తం రూ.122 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేయగా.. కేంద్ర రాయితీ నిధులను బట్టి ఈ పథకాన్ని అమలు చేస్తారు.
ప్రభుత్వం ఆటోలతో పాటుగా వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించనుంది. ఉన్నతి పథకం కింద ఎస్సీ రైతులకు రాష్ట్రవ్యాప్తంగా 2,685 మందికి.. రూ.1.50 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలను అందిస్తారు. వీటిలో వ్యవసాయంలో కీలకమైన పవర్ స్ప్రేయర్లు, బోర్ డ్రిల్లర్లు, మోటార్ ఇంజిన్లు, మోటార్ రివైండింగ్ మెషిన్లు ఉన్నాయి. ఈ మేరకు 50శాతం రాయితీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి.. లబ్ధిదారుడి నుంచి 10శాతం వాటాగా ఉంటుంది. అలాగే లబ్ధిదారులకు వడ్డీ భారం లేకుండా చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించి నెల వాయిదాల్లో చెల్లించేవారు. అయితే లబ్ధిదారులకు వడ్డీ భారం తగ్గించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఎస్సీలకు ఆటోలు అందించే పథకాన్ని సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) పరిధిలో అమలవుతున్న ఉన్నతి పథకంతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే డ్వాక్రా సంఘాలలో ఎస్సీ మహిళలకు వడ్డీలేని రుణాలును అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ, లబ్ధిదారుడి వాటా పోనూ ఆటో కొనుగోలుకు అవసరమయ్యే రూ.1.35 లక్షలు ప్రభుత్వం సున్నా వడ్డీ రుణంగా అందిస్తుంది. ఆటోలు మాత్రమే కాదు ఎస్సీ రైతులకు అందించే వ్యవసాయ పరికరాలకు కూడా ఇదే వర్తిస్తుంది.
































