అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసేదే లేదన్నారు. త్వరలోనే అర్హులైన వారిని ఇందిరమ్మ కమిటీల ద్వారా గుర్తించి.. లబ్ధిదారులకు అన్ని పథకాలు అందిస్తామన్నారు.
‘రాష్ట్రంలో పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు కాంగ్రెస్‌ను ఓడించాలా?.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నందుకు కాంగ్రెస్ ను ఓడించాలా?.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకా? ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నందుకా?. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నందుకా?.. మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం తీసుకోచ్చినందుకా..?
ఎందుకు కాంగ్రెస్ ను ఓడించాలి? ఎందుకు రేవంత్ ను పడగొట్టాలి?. నేను మీ బిడ్డను.. పాలమూరు మట్టి బిడ్డను.. పాలమూరు సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఓర్వలేకపోతున్నారు. ఏం.. దొరల బిడ్డలే సీఎం కావాలా?.. పాలమూరు బిడ్డలకు ఆ అర్హత లేదా? మాకేం తక్కువ?.. అరుణమ్మ బీజేపీ ముసుగులో బీఆరెఎస్‌తో కుమ్మక్కై రేవంత్ రెడ్డిని పడగొట్టాలని చూస్తోంది.
గద్వాల బంగ్లాలో కుమ్మక్కు రాజకీయలు చేస్తున్నారు. బీఆరెఎస్ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బయటకు వచ్చి ఓట్లు అడగడంలేదు. ఐదు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ మీ ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు. మోదీకి లొంగిపోయారు. బీఆరెఎస్ శ్రేణులారా ఆలోచన చేయండి. ఎందుకు మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలోని ముదిరాజ్ లకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారు. ముదిరాజ్ లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ లో చేర్చేందుకు పోరాడుతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక హామీలను ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ కు 15 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ముదిరాజ్ వ్యక్తికి మంత్రిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ దొరలకు, పెత్తందారులకు మాత్రమే టికెట్ ఇవ్వదని.. అన్ని వర్గాల వారికి టికెట్ ఇచ్చి గెలిపించిందని గుర్తు చేశారు. రాష్ట్ర జనాభాలో ముదిరాజ్ లు 10 శాతం మంది ఉంటే.. కేసీఆర్ కేవలం ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చారని అన్నారు.
ప్రజల కోసం కేసీఆర్ పట్టించుకోలేదు కనుకనే.. వంద అడుగుల గోతిలో బీఆర్ఎస్ ను పాతిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణ పేట జిల్లాలో కాంగ్రెస్ నిర్విహించన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రజలకు ఈ హామీలు ఇచ్చారు.
కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోందని సీఎం తెలిపారు. పక్కనుంచే కృష్ణా నది పారుతున్నా సరే బీఆర్ఎస్ పట్టించుకోకపోవడంతో.. చుక్క నీరు లేకుండా పోయిందన్నారు. అందుకే రూ.4వేల కోట్లతో మక్తల్, నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి… లక్షా 30 వేల ఎరకాలకు నీళ్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి వడ్లపై రూ.500 బోనస్ అందిస్తామని మరో హామీ ఇచ్చారు.
నారాయణపేట్, కొడంగల్, పగిరి, వికారాబాద్ ప్రజలు రైల్వే లైన్ కోసం ఎదురు చూస్తున్నారని దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం మాటిచ్చారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ ను కేటాయించిందని.. కానీ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి దాన్ని ఆపించిందని అన్నారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వికారాబాద్-కృష్ణా రైల్వే జోన్ తీసుకువస్తామన్నారు.