వాహనదారులకు గుడ్ న్యూస్ – రిజిస్ట్రేషన్లు, జరిమానాల్లో కీలక మార్పులు

పీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయింపు లో కీలక మార్పులు తెచ్చింది. ఇక నుంచి జాప్యం లేకుండా వాహనదారులకు నెంబర్ కేటాయింపు జరిగిపోనుంది.


ఫ్యాన్సీ నెంబర్లు కావాలను కొనేవారికి కొత్త అప్డేట్ ఇస్తోంది. ఇక.. జరిమానాల విషయంలోనూ మార్పులు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తరువాత వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో వీటి నిర్వహణకు సంబంధించి కొత్తగా మార్పులు చేస్తున్నారు.

కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి శాశ్వత రిజిస్ట్రేషన్ నంబరు కేటాయింపులో ఇక జాప్యం లేకుండా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాన్ని కొనుగోలు చేసిన వారంలోగా వారికి శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయించకపోతే, ఆటోమెటిక్‌గా ఆ నంబరు కేటాయింపు జరిగిపోయే లా సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేయనున్నారు. నిబంధనల ప్రకారం కొత్త వాహనం కొనుగోలు చేస్తే వాహన డీలరు షోరూమ్‌లోనే తొలుత తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయిస్తారు. ఆ తర్వాత వాహన్‌ పోర్టల్‌కు ఈ వివరాలు వెళ్లగానే రెండు, మూడు రోజుల్లో సంబంధిత రవాణా శాఖ అధికారి ఆ వాహనానికి శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయించాల్సి ఉంటుంది. కాగా, వాహనదారు ఫ్యాన్సీ నంబరు పొందాలనుకుంటే మాత్రం నెల రోజుల వరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరుతో వాహనం నడపవచ్చు. ఫ్యాన్సీ నంబర్లు అవసరం లేని వాహనాలకు వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరును కేటాయించాలి.

అయితే, ఇందు కోసం పలు ప్రాంతాల్లో నెల నుంచి రెండు నెలల పాటు నంబరు కేటాయించ కుండా జాప్యం జరుగుతోంది. నెంబర్ కేటాయింపు విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదు లు వస్తున్నాయి. దీంతో..ఈ మార్పు తీసుకొచ్చారు. సంబంధిత అధికారి వారంలోగా నంబరు కేటాయించకపోతే, ఆటోమేటిక్‌గా శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరు వచ్చేలా వాహన్‌ సాఫ్ట్‌వేర్‌లో వెంటనే మార్పులు చేయాలంటూ సాఫ్ట్‌వేర్‌ నిర్వాహకులైన నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ఉన్నత అధికారులకు కమిషనర్ లేఖ పంపారు. మరోవైపు కొత్త మోటారు వాహనచట్టం ప్రకారం భారీ జరిమానాలు ఉంటాయని కొత్త నిబంధనల అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఒక వాహనంపై 5కు మించి చలానాలు ఉంటే లైసెన్సు కోల్పోవాల్సిందే. ప్రస్తుతం అయితే 90 రోజుల్లోపు చలానా చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆ గడువును 45 రోజులకు తగ్గించారు. చలానా కట్టకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.