కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. కొత్త వేతన సంఘం ద్వారా ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. మరోవైపు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులకు కూడా ప్రయోజనం కలగనుంది.
ముఖ్యంగా ఈపీఎస్ పెన్షనర్లకు భారీ లాభం కలగనుంది.
ఈపీఎఫ్ఓ నిర్వహించే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ అత్యంత కీలకమైంది. ఈ పెన్షన్ స్కీంలో భాగంగా ప్రస్తుతం నెలకు 1000 రూపాయలు పెన్షన్ లభిస్తోంది. త్వరలో ఈ పెన్షన్ 7500 వరకు పెరగవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్‌లో అందుతున్న కనీస పెన్షన్‌ను 1000 రూపాయల నుంచి 7500 రూపాయలు చేయాలనేది డిమాండ్. ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షనర్లు చాలాసార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. కనీస పెన్షన్‌ను 7500-9000 మధ్యలో పెంచాలని కోరుతున్నారు. తద్వారా రిటైర్ ఉద్యోగులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురుకావు. ఈపీఎస్ 95 స్కీమ్ ప్రకారం ఇప్పటికే అధిక పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సామాజిక పెన్షనే 2 వేల నుంచి 4 వేల రూపాయలు ఉంటున్నప్పుడు ఈపీఎస్ పెన్షన్ 1000 రూపాయలే ఇవ్వడం ఏ మేరకు సమంజసమనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
ఈపీఎస్ 95 స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికే బసవరాజు బొమ్మై పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేసి పలు సూచనలు చేసింది. త్వరలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయవచ్చు.

































