చిన్నారులతో రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో ఎదురయ్యే ప్రధాన సమస్య బెర్త్. పెద్దలకు మాత్రమే బెర్త్ అవకాశం ఉంటుంది. అయితే చిన్నారులకు ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేస్‌లో అలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు. దీంతో చిన్నారులతో ప్రయాణం చేసే వారికి ఇబ్బందులు ఎదురవడం సర్వసాధారణం.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఇండియన్ రేల్వేస్ బేబీ బెర్తులను తీసుకొచ్చింది. నిజానికి ఈ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉన్నా తాజాగా ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో తెలిపారు. రైల్వే కోచ్‌లలో బేబీ బెర్త్‌లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ.. శుక్రవారం రాజ్య సభలో అడగ్గా దానికి బదులిస్తూ మంత్రి ఈ విషయాన్ని తెలిపారు.
ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేశామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద లక్నో మెయిల్‌లో రెండు బీబీ బెర్త్‌లను తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. మెయిల్‌లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్‌లలకు, బేబీ బెర్త్‌లను అమర్చామని తెలిపారు. దీనికి ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేశారని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఈ బెర్త్ ఏర్పాటు వల్ల సీట్ల వద్ద సామాన్లు ఏర్పాటు చేసుకునే స్థలం తగ్గిపోయిందని, అలాగే సీట్ల మధ్య దూరం తగ్గిందని చతెలిపారు.
ప్రయాణికుల కోచ్‌లలో మార్పులు చేయడం నిరంత ప్రక్రియ అని మంత్రి వివరించారు. ఇదిలా ఉంటే ఈ బేబీ బెర్త్‌లు అందుబాటులోకి వస్తే ఇకపై చిన్నారులతో ప్రయాణించే తల్లులకు కష్టాలు తీరుతాయి. ఒకే బెర్త్‌లో తల్లిబిడ్డ ఇబ్బందిపడే బాధ తప్పుతుంది.