తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ లోని ఎరువుల సరఫరా పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు.
రైతులు ఎవరూ ఎరువుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. సకాలంలో రైతులకు నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ మేరకు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
రైతులను ఇబ్బంది పెట్టడానికి వీలు లేదన్న మంత్రి
జనవరి, ఫిబ్రవరి నెలలో యూరియా వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, ఆ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే తగినంత యూరియా నిల్వచేసి, పంపిణీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత ఏజెన్సీలో ప్రతినిధులు పాల్గొని మంత్రి సూచనలను పాటిస్తామని తెలిపారు.
కేంద్రంతో సంప్రదించిప్రత్యేక చర్యలు చేపడుతున్నరాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2.48లక్షల టన్నుల ఎరువుల నిల్వ అందుబాటులో ఉంది. ఇది యాసంగి ప్రారంభదశ అవసరాలను తీరుస్తుంది. ఇక కేంద్ర ఎరువుల శాఖ డిసెంబర్ నెలలో రాష్ట్రానికి 86వేల టన్నుల యూరియాను కేటాయించింది. ఈ యూరియా ఇప్పటికే వివిధ పోర్ట్ లకు చేరినట్టు కూడా అధికారులు మంత్రికి తెలిపారు. దీనిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సకాలంలో రవాణా చేయడానికి ఎటువంటి జాప్యం జరగకుండా రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది.
కేంద్ర మంత్రులను కలిసి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
ఇక ఈ పని జరగడం కోసం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసి అనుమతులను వేగవంతం చేయాలని కోరారు. రైల్వే ర్యాక్ లను కేటాయించడం, పోర్టుల వద్ద అనుమతులను వేగవంతం చేయడం చేయాలని కోరారు.అంతేకాదు రవాణా ఆలస్యాన్ని నివారించాలని కూడా ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు.
ఎరువుల కోసం రాష్ట్రం ముందస్తు ప్రణాళిక
యాసంగి సాగు పనులు ఊపు అందుకోకముందే రవాణా సమస్యలను పరిష్కరించడం ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఎరువులు విషయంలో రైతాంగం ఇబ్బంది పడకుండా వారికి వనరులను సిద్ధం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతాంగానికి ఎరువుల కోసం ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.


































