అమరావతి రైతులకు శుభవార్త.. వైసీపీ 3 రాజధానులు గోవిందా!

www.mannamweb.com


మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అమరావతి పరిధిలోని మందడం గ్రామంలో మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అందులో పాల్గొనే రైతులంతా తమ శిబిరాన్ని ఎత్తేసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. నాలుగు సంవత్సరాలుగా వైసీపీ బహుజన పరిరక్షణ సమితి అనుబంధ విభాగం నేతల ఆధ్వర్యంలో మందడం సీడ్ యాక్సెస్ రోడ్డువద్ద మూడు రాజధానుల శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ తమను నమ్మించి మోసం చేసిందని వారంతా విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బహుజనులను ఏకం చేసి టీడీపీ గెలుపునకు కృషిచేస్తామన్నారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ సెల్ మాజీ అధ్యక్షుడు సంకే విశ్వనాథ్, యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అప్పికట్ల జవహర్ తోపాటు పలువురు నాయకులు టీడీపీ కండువా కప్పుకున్నారు.

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత తాము అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నామంటూ మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా నిర్ణయించింది. దీనిపై అమరావతి రైతులు మండిపడుతూ 29 గ్రామాల పరిధిలో దీక్షా శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలకు పోటీగా మందడంలో వైసీపీ ఆధ్వర్యంలో మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని ఎత్తేశారు.